పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? విజయసాయి రెడ్డి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారంతో పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెరమీదకు వచ్చింది. మాజీ మంత్రి నారాయణ అరెస్టు వ్యవహారం అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నా పత్రాలు మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ చక్రం తిప్పారని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలోనే టిడిపి నేత నారాయణను హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అరెస్ట్ చేశామని వెల్లడించారు. నారాయణను కోర్టులో హాజరు పరచగా, బుధవారం తెల్లవారుజామున నారాయణకు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ లభించింది.
ఇక నారాయణ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ లేదని చెబుతూనే, ఇప్పుడు ప్రశ్నాపత్రాల లీకేజీ బురద టిడిపి నేతలకు రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణను కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యానికి నారాయణను ఎలా బాధ్యుణ్ణి చేస్తారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కక్షపూరిత చర్య అని పేర్కొన్న చంద్రబాబు, తక్షణం జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు లేఖ రాశారు.

ఇక నారాయణ అరెస్ట్ వ్యవహారాన్ని టార్గెట్ చేస్తున్న టిడిపి నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. పేపర్ల లీకును 'సేవ'గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? అని విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు.
పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 11, 2022
1/2
అంతేకాదు ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే వత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు నీకు వినబడలేదా బాబూ? అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. అందుకేనా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రిని చేసింది? అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications