హైదరాబాద్ ఆదాయంలో ఏపీకి వాటా: కొత్త ప్రతిపాదన?
Chandrababu Naidu- Revanth Reddy meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి విభజన సమస్యల పరిష్కారం, నదీ జలాల పంపిణీ, ఏపీలోని పోర్టులు, టీటీడీలో తెలంగాణకు వాటాపై చర్చించారు.
విభజన సమస్యలే ప్రధానంగా..
ఏపీ విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయినా విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావట్లేదని, దీనిపై రెండు వైపుల నుంచి అత్యున్నత స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన ఈ కమిటీలు రెండు వారాల్లోగా మనుగడలోకి వస్తాయి. మరో ముగ్గురు చొప్పున అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

డ్రగ్స్‌పై ఉమ్మడిపోరు..
అప్పటికీ విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన మార్గాలు కనిపించకపోతే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేసి పరిష్కరించాలని నిర్ణయించారు. మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాలు సంయుక్తంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ నిర్వహించాలని ఉమ్మడిగా తీర్మానించారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టడానికీ ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి.
సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
చంద్రబాబు- రేవంత్ రెడ్డి సమావేశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు కోస్తా తీర ప్రాంతాలు, అక్కడ ఉన్న ఓడరేవుల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అడగటాన్ని తప్పుపట్టారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు.
అలాంటి ప్రతిపాదనలు ఏవీ..
అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు కోస్తా తీర ప్రాంతాలు, అక్కడ ఉన్న ఓడరేవుల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అడగుతున్న సమయంలో.. అలాంటి ప్రతిపాదనలను చంద్రబాబు ఎందుకు ఈ సమావేశంలో ప్రస్తావించలేకపోయారని నిలదీశారు.
హైదరాబాద్ ఆదాయంలో వాటా
దీనికి ప్రతిగా హైదరాబాద్ ద్వారా తెలంగాణకు వచ్చే ఆదాయంలో ఏపీకి కూడా వాటా అడగాలంటూ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టే ఇలాంటి ప్రతిపాదనలను అంగీకరించకూడదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహం, వ్యక్తిగత అవసరాలకు తావు లేదని అన్నారు.












Click it and Unblock the Notifications