Chandrababu : చంద్రబాబుకు నో బెయిల్, నో కస్టడీ-ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తో పాటు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతవారమే ఈ రెండు పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఏసీబీ కోర్టు తీర్పు మాత్రం రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను తోసిపుచ్చింది.

ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబుపై గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఈ క్వాష్ పిటిషన్ పై ఇవాళ వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుతో పాటు సీఐడీ కూడా బెయిల్, కస్టడీ పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై ఇప్పటికే వాదనలు పూర్తి కావడంతో ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా పడుతుందని అంతా భావించారు. కానీ ఏసీబీ కోర్టు మాత్రం ఇవాళ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే ఇవాళ లంచ్ బ్రేక్ తర్వాత ఏసీబీ కోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే చంద్రబాబు ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినా బెయిల్ కావాలని కోరారు. అలాగే సీఐడీ గతంలో ఓసారి రెండు రోజుల పాటు జైల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపినా మరోసారి ఐదు రోజుల కస్టడీ కావాలని కోరింది.
ఈ రెండు పిటిషన్లపై ఏసీబీ కోర్టు ఏకకాలంలో విచారణ జరిపింది. ఇరువైపులా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు న్యాయవాదులు స్కిల్ కేసులో ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసినందున ఏ 37గా ఉన్న చంద్రబాబుకు కూడా బెయిల్ కావాలని కోరారు. అలాగే సీఐడీ గతంలో కస్టడీలో చంద్రబాబు తమకు పూర్తిగా సహకరించలేదని, కాబట్టి మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. కానీ ఏసీబీ కోర్టు మాత్రం ఈ రెండు పిటిషన్లనూ అంగీకరించలేదు.












Click it and Unblock the Notifications