వల్లభనేని వంశీ కస్టడీ, జైల్లో వసతులపై కోర్టు కీలక నిర్ణయం..!
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ, జైల్లో అదనపు వసతులపై ఇరు వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోర్టులో విచారణ జరిగింది. వల్లభనేని వంశీపై నమోదైన కేసులపై దర్యాప్తు కోసం పోలీసులు ఆయన కస్టడీ కోరగా.. జైల్లో తనకు అదనపు వసతులు కావాలంటూ వంశీ కోర్టును కోరారు.

గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్ష్యుల్ని బెదిరించిన ఆరోపణలపై అరెస్టు అయిన వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు విజయవాడ సబ్ జైలుకు రిమాండ్ పై పంపారు. ఆ తర్వాత జైల్లో తనకు జైల్లో బెడ్ తో పాటు ఇంటి నుంచి ఆహారం, ఇతర వసతులు కల్పించాలంటూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వంశీ ఏమేం కోరుతున్నారో రాతపూర్వకంగా తెలుసుకుని చెప్పాలని కోర్టు నిన్న పోలీసుల్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంటి భోజనంతో పాటు మంచంలా ఎత్తున్న టేబుల్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే వంశీ ఆరోగ్యంపై రిపోర్టు ఇమ్మని కోర్టు ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో అదనపు వివరాలు రాబట్టేందుకు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ప్రాసిక్యూషన్ లాయర్లు వాదనలు వినిపించారు. వంశీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని అతని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే పది రోజులకు పైగా జైల్లో ఉన్న వంశీని కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. రేపు దీనిపై తీర్పు ఇస్తామని వెల్లడించింది. అలాగే వంశీకి ఇంటి భోజనం, ఇతర వసతులపైనా రేపు తమ నిర్ణయం చెబుతామని జడ్జి తెలిపారు.












Click it and Unblock the Notifications