అది కూడా సెక్యురిటీ ప్రొటోకాల్‌లో భాగమే: రాయి దాడి ఘటనపై సీపీ కాంతి రాణా
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు విజయవాడ సీపీ కాంతిరాణా టాటా. విజయవాడ పర్యటనలో తగినంత భద్రత కల్పించామన్నారు సీపీ. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్ల తోపాటు ఆక్టోపస్, సీఎం సిక్యూరిటీ కూడా ఉందని తెలిపారు. సీఎం యాత్రలో విద్యుత్ నిలిపివేయడం అనేది సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో భాగమేనని సీపీ వివరించారు.
కరెంట్ ఎందుకు లేదని ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయని సీపీ తెలిపారు. యాత్ర జరిగిన మార్గంలో కరెంట్ లైన్లు, కేబుల్ లైన్లు ఎక్కువగా ఉన్నాయని, ఎన్నికల ప్రచారానికి అన్ని తీగలు తొలగించడం కుదరదన్నారు. రూఫ్ టాప్ ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ నిలిపివేయడం సర్వసాధారణమని చెప్పారు. సీఎం పర్యటనకు ఒకరోజు ముందే కేబుల్ లైన్లు తేసేసినట్లు వెల్లడించారు.

యాత్ర సమయంలో ఆ రూఫ్ టాప్‌కి విద్యుత్ వైర్లు తగిలే అవకాశం ఉండటంతో.. సీఎం భద్రత కోసమే విద్యుత్ నిలిపివేసినట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంతా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగింది. అజిత్ సింగ్ నగర్ లో రాత్రి 8.04 గంటలకు వివేకానంద స్కూల్ సమీపంలో నుంచి ఒక వ్యక్తి సీఎంపైకి బలంగా రాయి విసిరాడు. సీఎం లక్ష్యంగా రాయి విసిరినట్లు తెలుస్తోంది. చీకట్లో.. గుంపు బాగా ఉండటం చూసుకుని దుండగుడు దాడి చేశాడని సీపీ తెలిపారు.
రాయి సీఎం నుదుటికి తగిలి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ పై పడిందన్నారు. వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం 8 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడి సీసీటీవీ కెమెరాలు, సెల్ ఫోన్లో తీసిన వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దుండగుడు ఎయిర్ గన్ తో కొట్టాడా? చేతితో విసిరాడా? అనేది తెలియాల్సి ఉందన్నారు. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని విజయవాడ సీపీ కాంతిరాణా తెలిపారు.
కాగా, గత శనివారం రాత్రి విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.












Click it and Unblock the Notifications