'గుడ్ బై' చంద్రబాబుగారూ..!!?
తెలుగుదేశం పార్టీకి స్వపక్షంలోనే విపక్షంగా తయారైన విజయవాడ ఎంపీ కేశినాని నాని వ్యవహారం అధిష్టానానికి చికాకు తెప్పిస్తోంది. రానున్న ఎన్నికల్లో తనకు బదులుగా తన సోదరుడిని బరిలోకి దింపేలా మాజీ మంత్రి దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, బొండా ఉమ.. ఇతర నేతలు రాజకీయం చేస్తున్నారంటూ 2019 నుంచి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటా
చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో బొకే ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు భారతీయ జనతాపార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని, విజయవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తారని వచ్చిన వార్తలను నాని కొట్టేశారు. తాను పార్టీ మారేది లేదని, అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని కేశినేని ప్రకటించారు. అంతేకాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లా సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేసిన సమయంలో బురిడీ కొట్టడంతోపాటు అధినేతపై కూడా విమర్శలకు దిగారు.

పార్టీకి తాను విధేయుణ్ని..
తాను టీడీపీకి పూర్తి విధేయుడినని, కానీ పార్టీలోని తప్పులను ఎత్తి చూపుతానంటూ అదేవిధానంలో పనిచేసుకుంటూ వచ్చారు. అధిష్టానం కూడా చూసీ చూడనట్లుగా వెళ్లింది. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. కేశినేని వాదన ప్రకారం.. తనకు వ్యతిరేకంగా నాయకుల్ని తయారుచేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాలనేది నాని డిమాండ్. తెలుగుదేశం పార్టీలో కోవర్టులు పెరిగారని, దీనివల్ల పార్టీకే నష్టమని, చంద్రబాబు చుట్టూ ఉండేవారంతా భజనపరులేనని బహిరంగంగా విమర్శించారు. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాన్ని బహిరంగంగా చెప్పడం కేశినేని నానికి మైనస్ గా మారింది.

కుమార్తె వివాహానికి ఆహ్వానం
అక్కడి నుంచి అధిష్టానానికి, కేశినేనికి దూరం పెరుగుతూ వచ్చింది. తగ్గించుకోవడానికి రెండువైపుల నుంచి ప్రయత్నాలు జరగలేదు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిసింది. తాజాగా కేశినేని దంపతులు, చంద్రబాబు, భువనేశ్వరిని కలిసి తమ కుమార్తె శ్వేత వివాహానికి రావల్సిందిగా ఆహ్వానించారు. తన రాజకీయ వారసురాలు శ్వేత అని ప్రకటించి కేశినేని తదుపరి స్టెప్ ఏమిటి? అనేది ఆసక్తిగా మారింది. మొదటి నుంచి పార్టీలో అతని రాజకీయం పార్టీలో ఆసక్తికరంగాను, ఉత్కంఠ భరితంగాను ఉండేది.