కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్లపై ఎన్ఐఏ కోర్టు ఏం తేల్చబోతోంది ?
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం రేపిన వైఎస్ జగన్ పై కోడి కత్తి దాడి కేసు మరోసారి తెరపైకి వస్తోంది. ఈసారి ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు తెరపైకి వచ్చిన కోడి కత్తి దాడి కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సీఎం వైఎస్ జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఆయన విజయవాడ సీబీఐ కోర్టు ముందు రెండు విజ్ఞప్తులు చేశారు. వీటిపై ఎన్ఐఏ కోర్టు ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కోడి కత్తి దాడి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ దాఖలు చేసిన కౌంటర్ ఈ మొత్తం కేసును ఒక్కసారిగా మలుపు తిప్పింది. కోడి కత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చిన ఎన్ఐఏ.. నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ తో పాటు వైజాగ్ ఎయిర్ పోర్టు రెస్టారెంట్ ఓవర్ హర్షవర్ధన్ కూడా టీడీపీ సానుభూతిపరులు కాదని తేల్చేసింది. దీంతో ఈ వ్యవహారం అంతా వైఎస్ జగన్ మెడకు చుట్టుకునేలా కనిపించింది. ఈ నేపథ్యంలో జగన్ ఎన్ఐఏ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

జగన్ తన రెండు పిటిషన్లలో ఒకటి ఈ కేసులో ప్రత్యక్షంగా హాజరు రాకుండా మినహాయింపు ఇవ్వాలని ఒకటి, కోడి కత్తి కేసును మరింత సమగ్రంగా విచారించాలని రెండో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇవాళ విజయవాడ ఎన్ఐఏ కోర్టు విచారణ చేపట్టబోతోంది. కోడి కత్తి కేసులో తాను కోర్టుకు హాజరైతే పలు సమస్యలు ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు మినహాయింపు ఇస్తుందా లేదా అన్నది ఇవాళ తేలిపోతుంది.
అలాగే కోడి కత్తి కేసులో మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తిపై సైతం ఇవాళ కోర్టు తన నిర్ణయం ప్రకటించబోతోంది. అయితే కోడి కత్తి కేసులో దర్యాప్తు పూర్తయి ఛార్జిషీట్ కూడా దాఖలు చేస్తున్నామని, ఇక దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని దర్యాప్తు సంస్ధ ఎన్ఐఏ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ జగన్ చేస్తున్న విజ్ఞప్తిని కోర్టు పరిశీలించబోతోంది. దీంతో ఈ పిటిషన్ పైనా కీలక నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications