జగన్ పై రాయి దాడి కేసులో అనూహ్య పరిణామం..!!
ఏపీలో ఎన్నికల వేళ జగన్ పై రాయి దాడి కలకలం రేపింది. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీని పైన ప్రధాని సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఎన్నికల సంఘం సీరియస్ అయింది. విజయవాడ పోలీసులు విచారణ చేసారు. కారణమైన వారిని అరెస్ట్ చేసారు. ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విచారణ తరువాత పోలీసులు తీసుకున్న నిర్ణయం ఆసక్తి కరంగా మారింది.
కీలక పరిణామం
ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాడి కేసులో అనుమానితుడుగా ప్రచారం జరిగిన దుర్గారావును పోలీసులు వదలి పెట్టారు. విజయవాడలో జగన్ పైన జరిగిన దాడి పైన ఉన్నతాధికారులు 20 ప్రత్యేక పోలీసు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టాయి. సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా, ఘటనా స్థలంలో సేకరించిన మూడు రాళ్లపై ఉన్న వేలిముద్రలు అధారంగా దర్యాప్తు చేపట్టాయి. ఇందులో ఏ1గా సతీష్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం సతీష్ నెల్లూరు సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు.

దుర్గారావు విడుదల
నిందితుడుగా అనుమానిస్తూ విచారణకు తీసుకెళ్లిన దుర్గారావును వదిలి పెట్టారు పోలీసులు. ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి అర్ధరాత్రి ఇంటి వద్ద విడిచి పెట్టారు. అయితే సతీష్ రిమాండ్ రిపోర్ట్‌లో A2 ప్రోద్బలం తోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఏ2 ఎవరన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగానే అనుమానితుడుగా ఉన్న దుర్గారావును విచారణకు తీసుకెళ్లారు. అయితే విచారణ తరువాత అతనికి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని భావించిన పోలీసులు శనివారం అర్థరాత్రి ఆయనను తన ఇంటివద్ద వదిలేసి వెళ్లిపోయారు.

కొనసాగుతున్న విచారణ
దీనిపై పోలీసులు స్పందిస్తూ కేవలం విచారణ నిమిత్తం దుర్గారావును తీసుకెళ్లామని ఎలాంటి సంబంధం లేదని తెలిసి వదిలిపెట్టామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏ2 ఎవరా అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విచారణ ముమ్మరంగా సాగుతోందని అధికారులు చెబుతున్నారు. దాడి కేసును హత్యాయత్నంగా నమోదు చేసారు. దీని వెనుక సూత్రధారులను పట్టుకుంటామని పోలీసుల అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications