Vijayawada Politics:టీడీపీ, జనసేన పొత్తుతో మారుతున్న లెక్కలు - ఆ సీట్లలో అభ్యర్దులు ఫిక్స్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పొత్తులు...ఎత్తులు..అభ్యర్ధుల లెక్కల్లో పార్టీల అధినేతలు నిమగ్నమయ్యారు. రాజకీయ రాజధాని విజయవాడలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. విజయవాడ పార్లమెంట్ తో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
మారుతున్న సమీకరణాలు : విజయవాడ నగర పరిధిలోని మూడు సీట్లలో ఈ సారి పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

అక్కడ గతంలో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన యలమంచిలి రవి తిరిగి జనసేన నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో యలమంచిలి రవి నాటి కాంగ్రెస్ అభ్యర్ధి దేవినేని రాజశేఖర్ ను స్వల్ప మెజార్టీతో ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 2014, 2019 లో వరుసగా టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ గెలుపొందారు.
తూర్పులో రవి వర్సస్ అవినాశ్ : ఈ సారి వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో దేవినేని అవినాశ్ పోటీ ఖాయమైంది. ఇప్పటికే నియోజకవర్గంలో అవినాశ్ పని చేసుకుంటున్నారు.ముఖ్యంగా కృష్ణలంక,రాణి గారి తోట, గుణదలలో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి అండగా నిలిచే ప్రధాన సామాజిక వర్గం లో గద్దే రామ్మోహన్ పైన వ్యతిరేకతతో ఉన్నారు.
వారిని తన వైపు తిప్పుకొనేందుకు అవినాశ్ ప్రయత్నాలు ముమ్మరం చేసారు. గద్దే రామ్మోహన్ స్థానంలో తూర్పు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ కీలకంగా భావిస్తున్న గన్నవరం నుంచి గద్దే అనురాధను బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. ఎలమంచిలి రవి కృష్ణలంక కాపు సామాజిక వర్గం తో పాటుగా జనసేన ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

పశ్చిమంలో దక్కేదెవరికి : అదే సమయంలో విజయవాడ పశ్చిమ పైనా రెండు పార్టీల నేతల్లో చర్చ సాగుతోంది.విజయవాడ పశ్చిమం నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పోతిన మహేశ్ జనసేన నుంచి సీటు ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కొంత కాలంగా స్తబ్దుగా ఉన్నట్లు సమాచారం.
పశ్చిమం పైన తొలుత జనసేన కన్నేసినా అక్కడ నెలకొన్న టీడీపీ అంతర్గత రాజకీయం..మారుతున్న రాజకీయంతో తూర్పు వైపు మళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా కేశినేని చిన్ని ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీలకు ఆమోద యోగ్యంగా సీట్ల ఖరారు జరగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దుల ఖరారు పైన విజయవాడ లోక్ సభ పరిధిలో ఆసక్తి పెరుగుతోంది.












Click it and Unblock the Notifications