బాబునే ధిక్కరించిన జలీల్: 'విస్మరిస్తే ఎన్ని రైళ్లు తగలబెట్టడానికైనా సిద్ధమే!..'
విజయవాడ: బీకామ్‌లో ఫిజిక్స్ అంటూ ఎవరూ మరిచిపోలేని రీతిలో హాస్యాన్ని పండించిన జలీల్ ఖాన్.. తనలో మరో కోణం కూడా ఉందని పరోక్షంగా చెబుతున్నారు. ముస్లింల సంక్షేమంపై ప్రభుత్వ తీరు పట్ల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అవసరమైతే ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవడానికైనా సిద్దమేనన్న సంకేతాలు పంపించారు.
మునుపెన్నడూ లేని రీతిలో అధిష్టానాన్నే ధిక్కరించేలా వ్యాఖ్యలు చేశారు జలీల్. కాపులు తమ రిజర్వేషన్ల కోసం ఒక్క ట్రైన్ మాత్రమే తగలబెట్టారని, కానీ ముస్లింలను విస్మరిస్తే అంతకన్నా ఎక్కువ ట్రైన్స్ ను తగలబెట్టాల్సి వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును హెచ్చరించారు.
విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్.. మే26వ తేదీ పలువురు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తేడాలొస్తే.. ఎవరితో విభేదించడానికైనా తాను వెనుకాడబోనని తేల్చి చెప్పారు. ఓవైపు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్దమవుతున్న తరుణంలో.. ముస్లింల సంక్షేమం, అభివృద్ది కోసం.. తానూ ప్రభుత్వాన్ని ధిక్కరించడానికైనా సిద్దమన్నట్లు జలీల్ వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సీఎం చంద్రబాబును పరోక్షంగా హెచ్చరిస్తూ.. తానెవరికీ భయపడే వ్యక్తిని కాదని, ఏం చేస్తారో చేసుకోవాలంటూ జలీల్ సవాల్ కూడా విసిరారు. ఏపీ మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా చోటు దక్కకపోవడాన్ని ముస్లిం సమాజం జీర్ణించుకోలేకపోతుందన్నారు. అదే సమయంలో ముస్లింల అభివృద్ది కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని మండిపడ్డారు.
నిజానికి ఏపీ మంత్రిపునర్వ్యవస్థీకరణకు ముందు జలీల్ ఖాన్ కు అందులో చోటు దక్కుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఎప్పుడైతే ఆయన బీకామ్ లో ఫిజిక్స్ అంటూ వివాదంలో ఇరుక్కున్నారో.. చేజేతులా మంత్రి పదవిని దూరం చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి.
మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ప్రస్తుతం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో ముస్లిం సమాజాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందన్న భావనతోనే.. ఆయన సీఎంను సైతం ధిక్కరించడానికి సిద్దమయ్యారన్న చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే, జలీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కమిషనర్ స్పందించారు. ఆయనపై ఎలాంటి కేసు బుక్ అవలేదని తెలిపారు.












Click it and Unblock the Notifications