ఇంక చాలు...వేధింపులు ఆపండి:పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆవేదన
గుంటూరు జిల్లా: "హక్కులు అధికారులకు...బాధ్యతలు పంచాయితీ కార్యదర్శులకు"...ఇదీ ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖలో నడుస్తున్న విధానమంటూ పంచాయితీ కార్యదర్శుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. తాము అహర్నిశలు శ్రమించినా ఇంకా ఇంకా పని చేయాలంటూ అధికారులు వేధిస్తున్నారంటూ ఏపీ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.డి.ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
పంచాయితీ కార్యదర్శుల సమస్యలపై చర్చించేందుకు మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని ఏపీ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.డి.ప్రసాద్ నేతృత్వంలో పంచాయతీ కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సుమారు 300 మంది పంచాయతీ కార్యదర్శులు, ఆ శాఖ ఉద్యోగులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏపీ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.డి.ప్రసాద్ మాట్లాడుతూ తాము ఎంత పనిచేసినా అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. పన్నుల వసూళ్లు గంటల్లోనూ, రోజుల్లోనూ అయిపోవాలని, లేకుంటే మిమ్మల్నిసస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.తమ శాఖలో హక్కులు అధికారులకు, బాధ్యతలు మాత్రమే తమకు అనేటట్టుగా వ్యవస్థ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోపక్క అసలు సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని, 6 నుంచి 18 ఏళ్లకు చెందిన ఇంక్రిమెంట్ల ఫైళ్లు కూడా అధికారులు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. అలాగే పెండింగ్ లో మెడికల్ బిల్స్‌ను క్లియర్ చేయడం లేదన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ కార్యదర్శిని రెండు మూడు గ్రామాలకు ఇంచార్జ్‌లుగా నియమించడంవల్ల పనిభారం అధికమైపోతోందన్నారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ జె.అరుణను కలిశారు. తమ సమస్యల గురించి డిపివో అరుణకు వివరించారు. ఈ విషయమై స్పందించిన డిపివో అరుణ మార్చి 15 నాటికి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications