లాక్ డౌన్ లో బయటకి రావొద్దన్న గ్రామ వాలంటీర్ హత్య- విజయనగరంలో దారుణం..
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ప్రజల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ప్రజలను కాపాడుతున్న పోలీసులు, వైద్యులు, వాలంటీర్ల విషయంలో ప్రజలు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరులో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చగా నిలిచిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోకి వచ్చే పనుకువలస పంచాయతీ కందిరివలసలో లక్షణరావు గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 18వ తేదీన వాలంటీర్ లక్షణరావు తన విధుల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఎవరూ ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని ప్రచారం చేస్తున్నాడు. అదే సమయంలో రోడ్డుపై తిరుగుతున్న గాదిపల్లి చిన్నారావు అనే వ్యక్తిని ఇంట్లోకి వెళ్లాలని సూచించాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఈ వివాదం ముగిసిపోయిందని అంతా భావించారు.

కానీ రెండు రోజుల తర్వాత ఈ నెల 20న చిన్నారావు, అతని తండ్రి సన్యాసి, సోదరుడు రామకృష్ణ గ్రామంలో ఒంటరిగా ఉన్న లక్షణరావుపై దాడి చేశారు. ఇందులో తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావును తొలుత సాలూరు ప్రభుత్వాసుపత్రికి, అనంతరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి, తర్వాత విశాఖ కేజీహెచ్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. నిన్న రాత్రి లక్ష్మణరావు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో పాచిపెంట పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications