తిరుమలలో ఎల్లుండి నుండి వారికి బ్రేక్ దర్శనాలు.. శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుభవార్త చెప్పారు. తిరుమలలో ఎల్లుండి నుండి విఐపి సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పైన ఎల్లుండి నుంచి బ్రేక్ దర్శనాలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.
మే 15వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తాం: మంత్రి ఆనం
మే 15వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. దీంతో ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖల మీద స్వామివారి దర్శనానికి వెళ్లాలని భావించే భక్తులకు స్వామివారి దర్శనానికి మార్గం సుగమమైంది. ఇక టీటీడీ కూడా సిఫార్సు లేఖ విషయంలో అధికారికంగా ప్రకటన చేసింది.

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల సిఫార్సు లేఖలు మాత్రమే పునరుద్ధరణ
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల పునరుద్ధరణకు మాత్రమే తాత్కాలికంగా టిటిడి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుండి సదరు నేతల సిఫార్సు లేఖలను మాత్రమే టిటిడి అనుమతించనుంది. అయితే మిగిలిన వారి సిఫార్సు లేఖలపై అంతకుముందు తీసుకున్న నిర్ణయం కొనసాగుతుంది . నియమావళి ప్రకారం అనుమతి పొందిన భక్తులకు ఈ నెల 16వ తేదీ నుండి శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
విఐపి సిఫార్సు లేఖల విషయంలో కీలక నిర్ణయం
వేసవికాలంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేవిధంగా వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని విఐపి సిఫార్సు లేఖల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే మే ఒకటవ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేయాలని టిటిడి నిర్ణయించింది.
వేసవిలో భక్తుల రద్దీతో నిర్ణయం.. ప్రస్తుతం నిర్ణయంలో మార్పు
ప్రజా ప్రతినిధులు, తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుల సిఫార్సు లేఖలు కూడా చెల్లవని ప్రకటించారు. ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే దర్శనాన్ని కల్పించే లాగా నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆ గడువును తగ్గిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు అవకాశం కల్పించనున్నారు.
నిన్న తిరుమల శ్రీవారిని దర్శనం ఇలా
ఇదిలా ఉంటే నిన్న తిరుమల శ్రీవారిని 68 వేల 760 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 544 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు ఇక పది వెయిటింగ్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు నాలుగు గంటల సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న తిరుమల స్వామి వారి హుండీ ఆదాయం 3.90 కోట్లు గా ఉంది.












Click it and Unblock the Notifications