దేహశుద్ధి చేసి, అరగుండు, చెప్పులదండలతో యువకుడి ఊరేగింపు.. అనంతపురంలో ఘటన!
అనంతపురం జిల్లాలో ఓ యువకుడిని చెప్పుల దండ వేసి ఊరేగించడం స్థానికంగా కలకలం రేపింది . స్థానికులు, బంధువులు కలిసి యువకుడిని బహిరంగంగా ఇలా గుండు గీయించి, చెప్పుల దండతో అవమానించారని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంతపురం జిల్లాలోని విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు, ఒక మహిళను ప్రేమించాడు.
వివాహితను ప్రేమ పేరుతో వేధించిన మాజీ ప్రియుడు
ఆమెకు వేరొకరితో వివాహం కాగా, ఆ తర్వాత కూడా అతను ఆమెను ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడుతున్నాడు. ఈ వేధింపుల కారణంగా భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమె భర్త ఆమెను పుట్టింట్లో వదిలివెళ్ళాడు. భాస్కర్ మహిళను వేధించాడని, ఆమెను బలవంతంగా వెంబడించాడని ఆరోపణలు ఉన్నాయి. యువతి తన కుటుంబానికి ఈ విషయం తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేహశుద్ధి చేసి చెప్పుల దండలు వేసి ఊరేగింపు
స్థానికులు కూడా ఈ విషయంలో బాధిత మహిళకు మద్దతు తెలిపి యువకుడిని బహిరంగంగా శిక్షించాలని నిర్ణయించుకున్నారు. భాస్కర్ ను పట్టుకుని దేహ శుద్ధి చేసి, అరగుండు వేసి, చెప్పుల దండలు మెడలో వేసి, ఊరంతా ఊరేగించారు. అయితే, చట్టప్రకారం ఇలాంటి చర్యలు సరికావని న్యాయ నిపుణులు చెబుతున్నారు. పోలీసులు ఈ సంఘటనపై స్పందించారు.
యువకుడిపై కేసు, యువకుడిని వేధించిన వీడియోతో సుమోటోగా కేసు
యువకుడిని వేధింపుల ఆరోపణలపై అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, యువకుడిని అవమానించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఘటనలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కొందరు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.పోలీసు అధికారులు ఈ వీడియోలు వైరల్ కావటంతో సుమోటోగా తీసుకుని విచారణ మొదలుపెట్టారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఘటనలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి వారిని విచారించనున్నారు. యువతి కుటుంబం నుంచి ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమాజంలో మహిళల భద్రత, యువత సమస్యలపై మళ్లీ చర్చకు కారణంగా మారింది. ఈ సంఘటన ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.













Click it and Unblock the Notifications