విశాఖ-చర్లపల్లి-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
సంక్రాంతి పండుగ పూర్తి కావస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాల రద్దీ మరోసారి పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరోసారి రైలు ప్రయాణాల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. అలాగే ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల మధ్య పండగ తర్వాత ప్రయాణాలు చేసే ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ మరో రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఏపీలోని విశాఖపట్నం నుంచి తెలంగాణలోని చర్లపల్లి (హైదరాబాద్) స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఇవాళ ప్రకటించారు. ఇందులో విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు నంబర్ 08517ను ఈ నెల 18వ తేదీ నడుపుతున్నారు. ఈ రైలు విశాఖలో మధ్యాహ్నం 3.50కు ప్రారంభమై మరుసటి రోజు అంటే 19న ఉదయం 7.30కు చర్లపల్లికి చేరుకోనుంది. అలాగే చర్లపల్లి నుంచి మరో ప్రత్యేక రైలు నంబర్ 08518 ఈ నెల 19న ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12.30కు విశాఖపట్నం చేరుకోనుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు రెండువైపులా దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేటల్లో స్టాపులు ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీల్ని అందుబాటులో ఉంచారు. కాబట్టి సంక్రాంతి తర్వాత విశాఖ-చర్లపల్లి మధ్య ప్రయాణాలు చేసే వారు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు సైతం వీరి కోసం అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications