విశాఖవాసులకు సముద్ర తీర చేపలపై కొత్త హెచ్చరిక!
విశాఖ వాసులకు తీవ్ర హెచ్చరిక. సహజంగా చేపలు తినటం ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం భావిస్తాం.. కానీ విశాఖలో చేపలు తినటం హానికరం.. ఇది నిజం. విశాఖ సముద్ర తీర ప్రాంతాల్లో దొరికిన చేపలపై జరిపిన అధ్యయనంలో షాకయ్యే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
విశాఖ సముద్ర తీరంలో పట్టిన చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు
విశాఖపట్నం తీరంలో రకరకాల చేపలు దొరుకుతాయి. చాలామంది వీటిని ఇష్టంగా కొనుక్కుని వెళ్లి తింటారు.అయితే విశాఖ సముద్ర తీరంలో పట్టిన చేపల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. నెత్తళ్లు, సావిడాయి, రిబ్బన్ ఫిష్ చేపల జీర్ణాశయం, మొప్పలు, కణజాలాల్లోనూ ఈ కణాలు గుర్తించబడ్డాయి. ప్రస్తుత స్థాయిలు ప్రమాదకరం కాకపోయినా, సముద్ర కాలుష్యం పెరుగుతున్న సంకేతంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో చేపను మూడు సార్లు పరీక్షించగా ప్రతిసారీ మైక్రోప్లాస్టిక్ కణాలు
సముద్ర కాలుష్యం పెరిగితే భవిష్యత్ లో చేపలు తింటే కూడా అనారోగ్యం పాలు కావాల్సి వస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మంజులత నేతృత్వంలో జి. చంద్రిక ఈ అధ్యయనం నిర్వహించారు. విశాఖ హార్బర్‌కు వచ్చిన 120 నెత్తళ్లు, 20 సావిడాయిలను పరిశీలించారు. ఒక్కో చేపను మూడు సార్లు పరీక్షించగా ప్రతిసారీ మైక్రోప్లాస్టిక్ కణాలు కనిపించాయి. ఈ పరిశోధన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో ప్రచురితమైంది.
సావిడాయిలలో ప్లాస్టిక్ కణాలు
జీర్ణాశయంలో అత్యధికంగా ఈ కణాలు ఉన్నాయి. 0.5 మి.మీ. నుంచి 4.5 మి.మీ. పరిమాణంలో ఉన్నాయి. సాధారణంగా చేపలు వండేటప్పుడు జీర్ణాశయం, మొప్పలు తీసేస్తారు. కానీ సావిడాయిలను ఎండబెట్టి తినే అలవాటు ఉన్నందున వాటిలోని ప్లాస్టిక్ కణాలు మిగిలిపోయే అవకాశం ఉంది.
ఫుడ్ చైన్ లో మైక్రోప్లాస్టిక్‌లు చేపల శరీరంలోకి .. కొత్త ఆందోళన
నెత్తళ్లు చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటాయి. తేలియాడే ప్లాస్టిక్ కణాలను కూడా పొరపాటున మింగుతాయి. దీని ద్వారా ఫుడ్ చైన్ లో మైక్రోప్లాస్టిక్‌లు చేపల శరీరంలోకి చేరుతున్నాయి. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు అవసరమని ఈ అధ్యయనం మరోసారి గుర్తు చేస్తోంది. మరి దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications