విశాఖ కొత్త మేయర్ గా, తేల్చేసిన పోలింగ్ - టర్న్ అయింది అక్కడే..!?
ఏపీలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. హోరా హోరీగా సాగిన ఈ సమరంలో ఫలితం మాత్రం ఉత్కంఠ పెంచుతోంది. ఏకపక్షంగా ఉంటుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ లోనూ పోలింగ్ సరళి పైన అంచనాలు పెరుగుతున్నాయి. 12 కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రీ పోలింగ్ ప్రారంభమైంది. రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సమయంలోనే విశాఖ ఫలితం పైన కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
సాగర తీరం విశాఖ కార్పోరేషన్ ఓటింగ్ పూర్తయింది. విశాఖలో 51.47 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూటమి ఘన విజయం ఖాయమని తొలి నుంచి అంచనాలు వ్యక్తం అయ్యాయి. అభ్యర్ధుల ప్రకటన.. ప్రచారం కొనసాగే సమయంలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రెబల్స్ బరిలో ఉండటంతో కూటమిలో కొంత టెన్షన్ కనిపించింది. వైసీపీ నుండి వరుదు కల్యాణి, ఎన్డీఏ కూటమి నుండి ముక్కు శ్రావణి మేయర్ పదవికి పోటీ చేసారు. నగరంలోని 120 వార్డుల్లో ఇద్దరు అభ్యర్ధులు హోరా హోరీగా ప్రచారం నిర్వహించారు. ఒక దశలో వరుదు కల్యాణి గట్టి పోటీ ఇస్తున్నట్లు విశ్లేషణలు వినిపించాయి. టీడీపీ అభ్యర్ధి శ్రావణికి మద్దతుగా మూడు పార్టీల నేతలు ప్రచారం చేసారు. ఇక.. పోలింగ్ సమయంలో మాత్రం లెక్కలు ఆసక్తిగా మారాయి.

తుది ఫలితం పై ఉత్కంఠ
విశాఖ కార్పోరేషన్ పరిధిలో భీమిలీ నియోజకవర్గంలో అత్యధికంగా 65% పోలింగ్ నమోదైంది. అక్కడే లెక్క మారింది. ఇద్దరి మధ్య హోరా హోరీగా ఓట్ల పోలింగ్ కొనసాగుతుందనే అంచనాలు ఒక్క సారిగా మార్పు కనిపించిందని చెబుతున్నారు. 21 వార్డుల్లో 45 శాతం కంటే తక్కువగానే పోలింగ్ నమోదైంది. యువ ఓటర్లు ఎక్కువగా సందడి చేసారు. తొలి రెండు గంటలు మందకోడిగా పోలింగ్ సాగినా.. తరువాత వేగం పెరిగింది. ఇక్కడ గెలుపు అటు కూటమి, ఇటు వైసీపీకి ప్రతిష్ఠాత్మ కంగా మారింది. అయితే.. పోలింగ్ పూర్తయిన తరువాత రెండు వైపులా విశ్లేషణ మొదలైంది. టీడీపీ తాము భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. వైసీపీ సైతం గట్టి పోటీ ఇచ్చామని.. ఫలితం ఏకపక్షంగా ఉండదని చెబుతోంది. ఎవరు గెలిచినా మెజార్టీ చాలా స్వల్పంగా ఉంటుంది అనేది సర్వే సంస్థలు చెబుతున్నాయి. దీంతో.. రేపు (మంగళవారం) జరిగే ఓట్ల లెక్కింపు పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications
