రాప్తాడు విద్యార్థినిని పరామర్శించనున్న జగన్
అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రంపం దాడికి గురై తీవ్రంగా గాయపడిన 10వ తరగతి విద్యార్థిని గోపికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోపిక.. ప్రస్తుతం బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఆ విద్యార్థినికి డాక్టర్లు దాదాపు 12 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారామె.
ఇప్పటికే గోపికను పరామర్శించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆదివారం సాయంత్రం బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. ఆమెకు అందుతున్న వైద్య సేవలు, శస్త్రచికిత్స వివరాలు, ప్రస్తుత ఆరోగ్య స్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా ఉన్నారు.

ఈ మధ్యాహ్నం జగన్.. మణిపాల్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. గోపిక ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్య నిపుణులను వివరంగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాలకు ఆయన ఆసుపత్రికి చేరుకుంటారు. డాక్టర్ల బృందంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గోపిక కోలుకుంటున్న తీరు, ఆమెకు అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకుంటారు. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించనున్నారు. వారికి మానసిక ధైర్యాన్ని అందించనున్నారు.
ఈ విషాదకర ఘటన ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో పోరాడుతున్న బాలికకు అవసరమైన అన్ని రకాల అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాల తరగతి గదిలోనే ఇటువంటి అమానుష దాడికి పాల్పడిన బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications
