అదే జరిగితే బద్రీనాథ్ కొట్టుకుపోతుంది! శాస్త్రవేత్తల షాకింగ్ వార్నింగ్
హిమాలయాల్లోని అత్యంత పవిత్రమైన బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి ఊహించని ప్రళయ ముప్పు పొంచివుందని తాజా శాస్త్రీయ అధ్యయనం హెచ్చరించింది. కొండలపై కత్తిలా వేలాడుతున్న మంచు పలకలు (హ్యాంగింగ్ గ్లేసియర్లు) విరిగిపడితే, ఆ మంచు తుఫాను ధాటికి బద్రీనాథ్ పట్టణంలోని వందలాది భవనాలు, ప్రధాన రహదారులు నిమిషాల్లో మట్టిమట్టయ్యే ప్రమాదం ఉందని విజ్ఞానవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
శాటిలైట్ డేటా, సాంకేతిక నమూనాల ఆధారంగా పరిశోధకులు బద్రీనాథ్ చుట్టూ ఉన్న మూడు ప్రధాన మంచు కొండలపై సమగ్ర అధ్యయనం నిర్వహించారు. కొండలపై నుంచి భారీగా మంచు విరిగిపడితే అది ఏ దిశగా, ఎంత వేగంతో ప్రవహిస్తుందో అంచనా వేసేందుకు 'రామ్స్' (RAMMS) అనే అత్యాధునిక సిమ్యులేషన్ సాంకేతికతను ఉపయోగించారు. మంచు పరిమాణం, కొండల వాలు , కింద ఉండే భూభాగ స్వభావమే ఈ ప్రళయ వేగాన్ని నిర్ణయిస్తాయని అధ్యయనంలో తేలింది.

'సైట్-2'తోనే తీవ్ర ప్రమాదం.. 400 భవనాలు ధ్వంసమయ్యే ఛాన్స్
రీసెర్చ్ చేసిన మూడు ప్రాంతాల్లో 'సైట్-2' అనే ప్రదేశం బద్రీనాథ్ పట్టణానికి అత్యంత ప్రమాదకరంగా మారినట్లు గుర్తించారు. ఒకవేళ ఇక్కడి నుంచి మంచు కొండ విరిగిపడితే, దాదాపు 398 భవనాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయి. అంతేకాకుండా 2.66 కిలోమీటర్ల మేర రహదారులు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతంతో పాటు హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలు కూడా ఈ ప్రళయ పరిధిలోకి వస్తాయని శాస్త్రవేత్తలు లెక్కగట్టారు.
కేవలం మంచు పరిమాణమే కాదు.. భూభాగమే అసలు విలన్!
సాధారణంగా మంచు ఎంత ఎక్కువ విరిగిపడితే ముప్పు అంత ఎక్కువ అని భావిస్తారు. కానీ ఈ అధ్యయనం ప్రకారం.. విరిగిపడే మంచు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, కొండల వాలు , నీటి ప్రవాహ మార్గాలు అనుకూలిస్తే ఆ మంచు ప్రవాహం ఊహించని వేగంతో చాలా దూరం వరకు దూసుకెళ్తుంది. దీనివల్ల ప్రళయ తీవ్రత ఊహకందని స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు.
తక్షణ చర్యలు అత్యవసరం: నిపుణుల హెచ్చరిక
ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే బద్రీనాథ్ క్షేత్రంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడం తక్షణ అవసరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తక్షణ హెచ్చరిక వ్యవస్థలను (Early Warning Systems) ఏర్పాటు చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం, పటిష్టమైన పట్టణ ప్రణాళికను అమలు చేయడం ద్వారా మాత్రమే రాబోయే భారీ విపత్తు నుంచి బద్రీనాథ్‌ను కాపాడుకోగలమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
