పవన్ వేలాడుతూనే: కేశినేనికి విష్ణుకుమార్ రాజు సవాల్, అయ్యన్నకు ప్రశంస
విజయవాడ: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ ఎంపీ కేశినేని నానికి సవాల్ విసిరారు. బీజేపీ పొత్తు వల్లే మెజార్టీ తగ్గిందన్న వ్యాఖ్యలు చేసిన నాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వాపా? బలుపా?
అంతేగాక, నాని స్థానంలో తాను ఉంటే ఇప్పటికే రాజీనామా చేసివుండేవాడినని అన్నారు. తాము ఏరుదాటాక తెప్ప తగిలేసే రకం కాదని అన్నారు. ప్రజల్లోకి వెళితే ఎవరిది వాపో.. ఎవరిది బలుపో తేలుతుందన్నారు.

అయ్యన్నకు ప్రశంస
విశాఖపట్నంలో జరిగిన భూస్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. నాయకులంతా అయ్యాన్న పాత్రుడిలా ఉంటే ఏపీ ఎప్పుడో అభివృద్ధి చెందివుండేదని అన్నారు. భూకుంభకోణాలపై అయ్యన్న మాట్లాడటం హర్షనీయమని విష్ణుకుమార్ రాజు అన్నారు.

బెదిరింపులకు గురిచేశారు
భూస్కాములపై ఫిర్యాదు చేస్తే తనను కూడా బెదిరింపులకు గురిచేశారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ముదపాక భూముల అక్రమాలు బయటపెట్టినందుకు తనను బెదిరింపులకు గురిచేశారని, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఆ బెదిరింపులకు బయపడేది లేదని విష్ణుకుమార్ రాజు తేల్చి చెప్పారు.

పవన్ వేలాడుతూనే ఉన్నారు..
ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తామని కేంద్రం చెబుతుంటే.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం హోదానే పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఎవరో తప్పుదోవపట్టిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications