విశాఖ బీచ్ రోడ్లో డబుల్ డెకర్ బస్సులు- రూ.250కే రోజంతా ప్రయాణం..!
ఏపీలో వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నా దాని అందాల్ని పూర్తిస్ధాయిలో తిలకించేందుకు పర్యాటకులకు మార్గాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బీచ్ రోడ్డు నుంచి ప్రయాణిస్తూ సముద్ర అందాల్ని రోజంతా తిలకించేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ హాప్ ఆన్, హాప్ ఆఫ్ బస్సుల్ని ప్రారంభించింది. సీఎం చంద్రబాబు ఈ డబుల్ డెకర్ బస్సుల్ని లాంఛనంగా ప్రారంభించారు.
విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకూ బీచ్ రోడ్ లో ఈ డబుల్ డెకర్ పర్యాటక బస్సులు ప్రయాణిస్తాయి. మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఈ సందర్భంగా హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులో ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు కూడా ప్రయాణించారు. ఆర్కే బీచ్ నుంచి బీచ్ రోడ్డు మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణం సాగింది. పర్యాటకులకు అభివాదం చేస్తూ బాబు ముందుకు సాగారు.

ఈ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారని, కానీ పర్యాటకుల సౌలభ్యం కోసం సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రూ.250 రూపాయలకే 24 గంటల పాటు టికెట్టును వర్తింప చేసేలా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. పర్యాటకులంతా పర్యావరణ హితంగా వ్యవహరించాలని, మన తీరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని కోరారు. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఈ బీచ్ లు నిర్వహించేందుకు పౌరులు సహకరించాలన్నారు.

మరోవైపు విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు చెబితే అవసరం లేదని మీరు తీర్పిచ్చారని ప్రజలకు తెలిపారు. రోడ్లపై గుంతలు పెట్టిన పాలకులు వాటిల్లోనే కొట్టుకు పోయారన్నారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా, ఆసియా టెక్నాలజీ హబ్ గా ఎదగబోతోందన్నారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ వేస్తారు. ఈ కేబుల్ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందన్నారు. భారత్ కే టెక్నాలజీ హబ్ గా విశాఖ ఎదుగుతుందని, మహిళలకు సురక్షితమైన నగరంగా ఎంపికైందని గుర్తుచేశారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై నగరాలతో విశాఖ పోటీ పడుతోందన్నారు. విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారింది.. ఇది మనం అంతా గర్వపడే అంశమన్నారు.












Click it and Unblock the Notifications