అదితి మృతిపై కోర్టుకు!: బిజెపి ఎమ్మెల్యే ఆగ్రహం, '40 కి.మీ. ఎలా వెళ్లిందో?'
విశాఖ: విశాఖపట్నంలోని మద్దెలపాలెం శ్మశానవాటికలో చిన్నారి అదితి అంత్యక్రియలు శుక్రవారం నాడు పూర్తయ్యాయి. అదితి అంతిమయాత్రకు పెద్ద ఎత్తున స్థానికులు తరలి వచ్చారు. అదితి కుటుంబ సభ్యులను స్థానిక నేతలు పరామర్శించారు. అదితి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. అదితి మృతి నేపథ్యంలో ఆమె ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం అదితి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. అక్కడి నుంచి స్మశాన వాటికకు తరలించారు.
అదితి లాంటి ఘటనలు జరగొద్దు: విష్ణుకుమార్ రాజు

అదితి మృతి నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మళ్లీ విశాఖలో జరగకుండా కాల్వల ఆక్రమణల పైన ఉక్కుపాదం మోపాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ నిర్లక్ష్యం, ఆక్రమణదారులే చిన్నారి అదితిని పొట్టన పెట్టుకున్నారన్నారు. అదితి దుర్మరణం పైన కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
కాగా, గత నెల 24వ తేదీన ప్రమాదవశాత్తూ అదితి డ్రయినేజీలో పడి గల్లంతైంది. గురువారం నాడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం బీచ్ వద్ద విగతజీవిగా తేలారు. తమ కూతురు ఎక్కడైనా బతికే ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. ఇప్పుడు ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.
'కాపాడుకోలేకపోయాం'
జీవీఎంసీ నిర్లక్ష్యం వల్లే అదితి మృతి అని పలువురు మండిపడుతున్నారు. ఆమె డ్రయినేజీలో పడటాన్ని చూసి, రక్షించేందుకు కొందరు వెళ్లారని, కానీ దొరకలేదన్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమన్నారు.
తన కూతురు బతికే ఉంటుందని, తమ వద్దకు వస్తుందని ఏడు రోజుల పాటు తల్లిదండ్రులు ఆశపడ్డారని, కానీ చివరకు ఆమె మృతదేహం చూసి తల్లడిల్లుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం.. వరకు 40 కిలోమీటర్లు ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications