రైల్వే స్టేషనే ఇతడి అడ్డా: ముంబైలో ట్రైనింగ్, విశాఖలో దోపిడీలు
అమరావతి: ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి, దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగ ఆకుల ప్రకాష్‌ను గోపాలపట్నం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, మత్తు ట్యాబ్లెట్లు 100 స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రామ్ గోపాల్ నాయక్ వివరాలు వెల్లడించారు. 2014 జూన్, జులై నెలలో సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో రెండు బ్యాగ్‌లు చోరికి గురైనట్లు బాధితులు గోపాలపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఇందులో భాగంగా ఈనెల 29న గోపాలపట్నం ప్రాంతంలో పెందుర్తి మండలం, పెదనరవకు చెందిన ఆకుప ప్రకాష్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితుడు ఆకలు ప్రకాష్ దోపిడీలకు ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాలను ఎన్నుకుంటుండేవాడు. లగేజితో వెళ్తున్న వారితో పరిచయం పెంచుకుని నమ్మకం కలిగించాక వారికి టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తుండేవాడు. అందులో ఎటివాన్ 2 ఎంజీ ట్యాబ్లెట్లు కలపడంతో ప్రయాణికులు మత్తులోకి జారుకునేవారు.
అదే అదనుగా వారి బ్యాగులతో ఉడాయించేవాడు. ఇలా నిందితుడు 20వ ఏట నుంచే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముంబై, ఢిల్లీ, సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, నాగ్‌పూర్ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో దొంగతనాలకు పాల్పడ్డాడు.

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 2005లో వృద్ధ దంపతులకు విషమిచ్చిన కేసులో ఆకుల ప్రకాష్ ప్రధాన నిందితుడని పోలీసులు నిర్ధారించారు. ఆ హత్య అనంతరం ముంబై వెళ్లిపోయి పలు నేరాలకు పాల్పడ్డాడు. 2012లో సికింద్రాబాద్ జీఆర్‌పీ పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకి తరలించారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత 2014 మే-జూన్ నెలల్లో విశాఖలో సింహాచలం కొండపై దొంగతనాలకు పాల్పడి మళ్లీ సికింద్రాబాద్ వెళ్లిపోయాడు. అక్కడ ఆటోడ్రైవర్ అవతారమెత్తి బ్యాగ్‌లు దోచుకున్న కేసులో గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకి తరలించారు. జైలు నుంచి విడుదలయ్యాక భార్య, బిడ్డలను తీసుకుని విశాఖలోని పెందుర్తి మండలం పెదనరవలో నివాసముంటున్నాడు. ప్రస్తుతం పోలీసులకు చిక్తి జైలుపాలయ్యాడు.












Click it and Unblock the Notifications