రైల్వే జోన్ వివాదం : 'ఉత్తరాంధ్రపై మళ్లీ వివక్ష.. చంద్రబాబు కుట్రే!'
విశాఖపట్నం : హోదానా..? ప్యాకేజీనా..? అన్న సంగతి పక్కనబెడితే విశాఖకు దక్కాల్సిన రైల్వే జోన్ మాత్రం విజయవాడకు తరలిపోయిందన్న విషయం చూచాయగా స్పష్టమవుతోంది. అధికారికంగా దీనిపై ప్రకటన రాకపోయినప్పటికీ ప్రముఖ పత్రికలన్నింటిలోనే ఇదే వార్త ప్రధానంగా కనిపించడంతో.. ఉత్తరాంధ్రపై కేంద్రం మరోసారి తన వివక్షను బయటపెట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా ప్రస్తావించడం తెలిసిందే. రైల్వే జోన్ ను విశాఖలో ఏర్పాటు చేయడం కంటే విజయవాడలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చంద్రబాబు వెల్లడించారు. ఆ తర్వాత పత్రికలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తలు ప్రచురించాయి. దీంతో విశాఖ వాసులు ఇప్పుడు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. బుధవారం నాడు అఖిల పక్ష ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు విశాఖ వాసులు. రైల్వే జోన్ ను విజయవాడకు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రైల్వే జోన్ ఖచ్చితంగా విశాఖలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏళ్లుగా ఉత్తరాంధ్రను చిన్న చూపు చూస్తోన్న కేంద్రం రైల్వే జోన్ ను విశాఖకు కాకుండా విజయవాడకు కేటాయించాలనుకోవడం వివక్షను పరాకాష్టకు తీసుకెళ్లడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ జనం.
రైల్వే జోన్ ను విశాఖకు కాకుండా విజయవాడకు మార్చిన యెడల మరో ఉద్యమం తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. 'చంద్రబాబు మోడీ ఇద్దరు కలిసి కుట్ర చేసి ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని' మండిపడుతున్నారు రైల్వే జోన్ సాధన సమితి నేతలు. ఈ సందర్బంగా ఎంపీ సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమని, ఏపీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభుపై ఈ విషయంలో చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు సుబ్బిరామిరెడ్డి.












Click it and Unblock the Notifications