వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్-కార్మిక సంఘాల నోటీసు..?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మికులు ఇవాళ షాకిచ్చారు. తాము సమ్మెలోకి దిగుతున్నట్లు పేర్కొంటూ అధికారులకు నోటీసు ఇచ్చారు.
మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం తాజాగా రూ.10300 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఓవైపు ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా కేంద్రం భారీ సాయం ప్రకటించడంతో అంతా సర్దుకున్నట్లే అని భావించారు. అయితే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదంటూ కార్మిక సంఘాలు తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని నెలలుగా రెగ్యులర్ గా జీతాలు అందడం లేదని ఆరోపిస్తూ వారు సమ్మెకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించేందుకు కేంద్రం మొగ్గు చూపడం లేదు. సొంత గనులు లేకుండానే అనకాపల్లిలో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ ఆగిపోయిదంటూ కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని అంతా భావించారు. కానీ రెండు, మూడు నెలలుగా ప్లాంట్ గాడిన పడుతున్నా తమకు జీతాలు మాత్రం ఇంకా బకాయిలు ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications