ఐఐటి గౌహతిలో విశాఖ విద్యార్థి ఉరేసుకుని మృతి
గౌహతి: గౌహతి ఐఐటిలో చివరి సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు (21) అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడు. గురువారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐఐటి ప్రతినిధి ఒకరు చెప్పారు. పరమేశ్వర్ మృతికి కారణమేమిటో ఇంకా వెల్లడి కానప్పటికీ చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు.
విశాఖ జిల్లా కె.కోటపాడుకు చెందిన పరమేశ్వరరావు తెలివైన విద్యార్థి. నవోదయ స్కూల్‌లో చదివిన పరమేశ్వర్ విశాఖలో ఇంటర్ పూర్తిచేశాడు. రోజూ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడే, పరమేశ్వర్ బుధవారం రాత్రి కూడా మామూలుగానే మాట్లాడినట్టు తండ్రి వెంకటరావు తెలియచేశారు. తక్కువ మార్కులు వచ్చాయని తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు.

తన కుమారుడు ఎప్పుడూ మంచి మార్కులతోనే ఉత్తీర్ణుడవుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆయన కోటపాడులో టెంట్ హౌస్ నడుపుతున్నారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎలా చనిపోయాడో తెలియడం లేదని ఆయన చెప్పారు. పరమేశ్వరరావుకు ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. కాకి పరమేశ్వర రావు బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
పరమేశ్వర రావు బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత మిత్రులతో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత ఐఐటి క్యాంపస్‌లోని బారక్ హాస్టల్‌లోని తన గదికి వెళ్లాడు. ఆ తర్వాత అతను కనిపించలేదని విద్యార్థులు చెబుతున్నారు. అతను గదిలో ఉరేసుకున్న దృశ్యాన్ని ఓ విద్యార్థి గురువారం సాయంత్రం చూశాడు.












Click it and Unblock the Notifications