త్వరలో విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల కీలక నిర్ణయం- అవే ప్రామాణికమా ?
విశాఖ రాజధానిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతివ్వలేక, అలాగని వ్యతిరేకించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు స్ధానిక ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్ధానిక ఫలితాలను మూడు రాజధానుల ప్రతిపాదనకు రిఫరెండంగా భావిస్తున్న విశాఖ నగర ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయాన్ని బట్టి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ పోరులో విశాఖ టీడీపీ హవా
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి బలంగా వీచినా విశాఖ నగరంలో మాత్రం పసుపు జెండా రెపరెపలాడింది. విశాఖ ఎంపీ స్ధానాన్ని వైసీపీకి కోల్పోయినా నగరంలోని తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. విశాఖ తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్, పశ్చిమ నుంచి గణబాబు గెలుపొందారు. అయితే వైసీపీ అధికారం చేపట్టాక గంటా శ్రీనివాస్ మినహా మిగతా మిగతా వారంతా టీడీపీ కార్యక్రమాలకు, అసెంబ్లీకి హాజరువుతుండగా.. గంటా మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.

విశాఖ రాజధాని ప్రకటనతో డిఫెన్స్ లోకి
ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తూ సీఎం జగన్ గతేడాది డిసెంబర్ లో అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన స్ధానిక టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపింది. అయితే పరిస్ధితిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి తెరలేపడంతో వీరు అయోమయంలో పడ్డారు. విశాఖను కాదని అమరావతికి మద్దతుగా పార్టీ చేపట్టిన ఉద్యమాన్ని సమర్ధించలేక, అలాగని విశాఖలో రాజధానిని వ్యతిరేకించలేక వీరు సతమతమవుతున్నారు. మేలో విశాఖ నుంచే ఏపీ సర్కారు కార్యకలాపాలు ప్రారంభం కానున్న తరుణంలో వీరిలో ఒక్కరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

స్ధానిక పోరు రూపంలో అవకాశం
విశాఖ రాజధానిపై వైసీపీని సమర్దించలేక, సొంత పార్టీ టీడీపీని సమర్ధించలేక ఇబ్బందులు పడుతున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు స్ధానిక ఎన్నికల రూపంలో మంచి అవకాశం వచ్చింది. స్ధానిక పోరులో టీడీపీ తరఫున పనిచేసినా ఫైనల్ గా వచ్చే ఫలితాలు వైసీపీకి వస్తే ఏం చేయాలనే దానిపై ఇప్పటికే వీరంతా మథనపడుతున్నారు. అయితే ఈ ఫలితాలే తమ భవిష్యత్ రాజకీయంపై క్లారిటీ ఇస్తాయని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయం ఆధారంగా తమ భవిష్యత్ రాజకీయాన్ని ఖరారు చేసుకోవాలని వీరు భావిస్తున్నారు.

స్ధానిక ఫలితాల్లో తేడా వస్తే..
ఈ నెలాఖరుతో ముగిసే స్ధానిక పోరులో ఫలితాలు టీడీపీకి అనుకూలంగా లేదా మిశ్రమంగా వస్తే సరేసరి. కానీ ఏకపక్షంగా అధికార వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం ప్రజాభిప్రాయాన్ని తాము కూడా గౌరవించాలనేది టీడీపీ ఎమ్మెల్యేల వ్యూహంగా తెలుస్తోంది. విశాఖ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో గంటా శ్రీనివాస్ మినహా మిగతా వారంతా దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేసిన వారే. గంటా శ్రీనివాస్ మాత్రం పార్టీలు మారుతూ టీడీపీలో ఉన్నారు. అయితే ఈసారి స్ధానిక పోరులో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తే వాటిని కారణంగా చూపుతూ అధికార పార్టీకి జై కొట్టాలని వీరు భావిస్తున్నట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నగరానికి చెందిన పలువురు సీనియర్ నేతలతో పాటు తన అనుచరులు కూడా వైసీపీలో చేరిపోవడంతో మిగతా టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుని వైసీపీ గూటికి చేరాలని గంటా శ్రీనివాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications