ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మరో వందేభారత్?
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణ అనుభూతిని సొంతం చేయాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో 52 ట్రిప్పులు వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ఇవి నడుస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే ప్రయాణికుల ఆదరణను చూరగొన్నాయి.
తాజాగా మరో వందే భారత్ రైలు విశాఖపట్నంకు చేరుకుంది. దాదాపు మూడు వారాల నుంచి దీన్ని రైల్వే యార్డులో ఉంచారు. అయితే ఏ మార్గంలో తిప్పడానికి తెప్పించారో సమాచారం లేదుకానీ ప్రస్తుతానికి మాత్రం నిరుపయోగంగా ఉంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టారు. దాదాపు నెలరోజుల వ్యవధిలో 20 రోజులపాటు ప్రధాన రైళ్లను రద్దు చేశారు. ఇటువంటి సమయంలో తిప్పడం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో యార్డులో పెట్టివుంటారంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ విశాఖ వచ్చినా, సికింద్రాబాద్ వెళ్లినా అరగంట సమయంలో తిరిగి బయలుదేరుతోంది. ఏదైనా మరమ్మతులకు గురైతే ఆరోజుకు రైలు సౌకర్యాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి తెప్పించారని చెబుతున్నారు. అయితే విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రస్తుతం తిరుమల ఎక్స్ ప్రెస్ ఒకటే నడుస్తోంది. ఆ రైలును విశాఖ-తిరుపతి మధ్య తిప్పే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏదన్నాకానీ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తయితేకానీ ఒక స్పష్టత వచ్చేలాలేదు.












Click it and Unblock the Notifications