వోల్వో ప్రమాదం: నిమిషాల్లో మృతి, అలాఐతే బతికేవారు
హైదరాబాద్: వారం రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదం పైన విచారణ జరుగుతోంది. బస్సులో సజీవదహనమైన వారు మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లోనే మరణించినట్లుగా క్లూస్ టీం నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కార్పన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యాయి.
దీంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు మేల్కొనేసరికి ఆ రెండు వాయువులు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో వారు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. బస్సులోకి ఆక్సిజన్ అందలేదు.

ఆ స్థితిలో ఎవరైనా ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకడం అసాధ్యమని, అద్దాలు పగులగొట్టి ఉంటే ఆక్సిజన్ సరఫరా జరిగి చాలామంది బతికే వారని, ఆ అవకాశం లేకపోవడంతో మంటలు తీవ్రత పెరగకముందే అంతా మృత్యువాత పడ్డారని తేల్చింది. దీంతో ప్రయాణీకులు మరణించాకే మంటల్లో కాలిపోయారని, బస్సుల్లో బాణసంచా, పేలుడు పదార్థాలు లేవని తేల్చింది.
కల్వర్టును బస్సు దూసుకు వచ్చి తాకడంతో ప్రమాదం సంభవించింది. కల్వర్టును బలంగా ఢీకొనడంతో బస్సు రేకు ఊడింది. అదే సమయంలో రెయిలింగ్ గొట్టం.. డీజిల్ ట్యాంకుకు గుచ్చుకోవడంతో లీకైంది. ఊడిన రేకు.. రహదారిపై రాసుకుంటూ వెళ్లడంతో నిప్పురవ్వలు వచ్చాయి. ఊడిన రేకుకు దగ్గర లగేజీ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
ఈ ప్రమాదం పైన మరిన్ని టీంలు విచారణ జరుపుతాయని, ఆ తర్వాతే తుది నివేదిక ఉంటుందని వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications