బీజేపీ-టీడీపీ పోరు మరింత తీవ్రం ? అచ్చెన్న వ్యాఖ్యలకు విష్ణు ఘాటు కౌంటర్..!
ఏపీలో శాంతిభద్రతల పరిస్థితులపై బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశంలో సోము వీర్రాజుపై అచ్చెన్నాయుడు విమర్శలు చేయడాన్ని ఖండించారు. ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా అచ్చెన్నాయుడు వక్రీకరించి మాట్లాడుతూ రాజకీయ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని, ముందు వైసీపీపై ధైర్యంగా పోరాడాలని అచ్చెన్నాయుడుకు సలహా ఇచ్చారు. ప్రతిసారీ పోరాడకుండా పారిపోయి, ఇప్పుడు బీజేపీపై నిందలేయాలని ప్రయత్నించడం ఏమిటన్నారు.
అచ్చెన్నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలేయడం చేతకాని తనమేనన్నారు. వైసీపీపై పోరాడలేక బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారన్నారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేసి మరీ పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారని, అన్ని రకాలుగా వైఫల్యంగా చెందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ గా ఘోరవైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గుర్తించారని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే 2018-19లోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేవారని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో అమిత్ షా పై తిరుపతిలో రాళ్ల దాడి జరిగిందని, ప్రధాని పర్యటనకు వస్తే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని, నల్లబెలూన్లు ఎగురవేశారని గుర్తుచేశారు. ఇలాంటి వాటితో పాటు బెంగాల్, కేరళలో జరుగుతున్న రాజకీయాల్ని బీజేపీ ధైర్యంగా ఎదుర్కొంటున్న విషయాన్ని సోము వీర్రాజు చెబితే దానికి పెడర్థాలు తీసి కుట్రపూరిత వ్యాఖ్యలుచేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.
ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూ, మరో వైపు బీజేపీని దెబ్బతీసే కుట్రలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అమలు చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నేడు సందర్భం లేకుండా ప్రత్యేక హోదా అంశం మాట్లాడడం, రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తే దానిమీద రాజకీయ దుష్ప్రచారం చేయడం , రాష్ట్రంలో కేంద్ర పథకాలు జరుగుతున్న తీరును ఓర్చుకోలేకపోవడం , మరోవైపు కేంద్రం ఏపీలో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ఆ రెండు పార్టీలు ఒకటేనన్న అభిప్రాయం కల్పించేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోజూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications