Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వాగ్వాదం: ఎర్రబెల్లి 'దాడి'పై కేసీఆర్ ఆగ్రహం,బాబు చరిత్ర

హైదరాబాద్: శాసనసభలో సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో ఎర్రబెల్లి ప్రసంగం పైన తెరాస సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎన్ని చెప్పినా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని, ఎక్కువ విద్యుత్ ఇస్తారని రైతులు భావించారని, కాని నాలుగైదు గంటలు కూడా రావడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యల పైన సీఎం ఎదురు దాడి చేశారని మండిపడ్డారు. తాను రైతు బిడ్డనన్నారు.

దాడి చేశామంటే ఎలా?

ఎదురు దాడి అన్న ఎర్రబెల్లి వ్యాఖ్యల పైన కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను వాస్తవాలు చెబితే ఎదురు దాడి చేశానని చెప్పడం సరికాదన్నారు. వాస్తవాలు చెబితే ఎదురుదాడిలా కనిపిస్తోందా అన్నారు. ఆ పార్టీలో ఉండటమే మీ ఖర్మ అన్నారు. ఎర్రబెల్లి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేదా వాటిని తొలగించాలని సభాపతిని కేసీఆర్ కోరారు. తాను రైతు బిడ్డనని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకే మీరు ఉన్నారని చెబితే, ఊరుకుంటామన్నారు.

War of words between KCR and Errabelli in Assembly

రైతును.. ఫాం హౌస్ రైతును కాదు

కేసీఆర్ వ్యాఖ్యల పైన ఎర్రబెల్లి అదే స్థాయిలో స్పందించారు. తాను ఫామ్ హౌస్ రైతును కాదని ఎద్దేవా చేశారు. తాము ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకు కాదని, చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని నిందించాలని తమకు లేదన్నారు. ఉన్నదాంట్లో ఎంత చక్కగా చేయవచ్చో తాము చెబుతున్నామని, మీరు చేయలేకపోతున్నారనే బాధ ఉందన్నారు.

విద్యుత్ సమస్యల పైన మాట్లాడాలని కేసీఆర్ సూచించగా.. తాము అదే సమస్య పైన మాట్లాడుతున్నామని, అలా వద్దంటే ముఖ్యమంత్రి ఎం చెప్పమంటారో రాసివ్వమనండి.. అదే చదవుతామన్నారు. మీ పొరపాట్లు చాలా జరిగాయన్నారు. రైతుల ఆత్మహత్యలకు తప్పకుండా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే అన్నారు.

రెండు నెలలుగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీతోనే రైతులు పంట వేసుకున్నారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మాట మార్చిందన్నారు.

బాబు చరిత్ర సృష్టించారు

తొమ్మిదేళ్ళు కరువు ఉన్నప్పటికీ నాడు చంద్రబాబు తొమ్మిది గంటలు విద్యుత్ ఇచ్చి చరిత్ర సృష్టించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడు గంటలు ఇస్తే, మీరు ఐదు గంటలు ఇస్తున్నారన్నారు. కేంద్రం విద్యుత్ ఇచ్చేందుకు సముఖంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.

దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ.. విద్యుత్ ఇస్తామంటే వద్దంటామా అని ఎదురు ప్రశ్నించారు. తమ ప్రభుత్వాల హయాంలో ఆత్మహత్యలు జరగనట్లు విపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. చేతగాక అనే మాటలు అనవద్దన్నారు. రైతుల ఆత్మహత్యకు అసలు టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు. కరెంటు లేదని ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి చెప్పకుండా ఉంటారా అన్నారు. తాము వచ్చి ఐదు నెలలు కూడా కావడం లేదన్నారు. మా వద్ద ఏమైనా మంత్ర దండం ఉందా అన్నారు.

నిమిషానికోసారి లేస్తే ఎలా: కిషన్ రెడ్డి

కాగా, పలుమార్లు మంత్రులు అడ్డుకోవడంపై బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి స్పందించారు. నిమిషానికోసారి మంత్రులు లేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారన్నారు. ప్రతిసారి లేవడం ఏమిటన్నారు. మంత్రులకు కూడా సమయం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎన్నిసార్లు లేచి కూర్చున్నారో చూడాలన్నారు. సీఎం సరే.. మంత్రులు కూడా లేవడం ఏమిటన్నారు.

హక్కు లేదనొద్దు: హరీష్ రావు

తమకు హక్కు లేదని అనవద్దని హరీష్ రావు అన్నారు. మీ అనుమానాలు నివృత్తి చేసేందుకు మేం ఉన్నామన్నారు. మీరు సభను తప్పుదోవ పట్టిస్తే వాస్తవాలు చెప్పేందుకే ఉన్నామన్నారు. తమకు రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రభుత్వం ఐదు నెలల్లో ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. రుణమాఫీ చేసిందన్నారు. వీటిని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. వ్యవసాయం దండుగ అన్న టీడీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదన్నారు.

రైతు ఆత్మహత్య బాధాకరమే: కేసీఆర్

రైతు ఏ సందర్భంలో ఆత్మహత్య చేసుకున్నా బాధాకరమేనని కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ సమస్య పైన తాను స్వయంగా ప్రధానిని కలిశానని చెప్పారు.

బషీర్ బాగ్ రగడ

ఎర్రబెల్లి మాట్లాడుతున్న సమయంలో బషీర్ బాగ్ కాల్పుల విషయం చర్చకు వచ్చింది. దీని పైన ఎర్రబెల్లి స్పందించారు. బషీర్ బాగ్ కాల్పుల సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బాబు ఎన్నడు రైతుల విషయంలో హేళనగా మాట్లాడలేదన్నారు. అలా రికార్డులు చూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమన్నారు. వరంగల్ రావాలని సవాల్ చేశారు.

తెలంగాణకు రమ్మని కేంద్రమంత్రికి చెప్పా

మా ప్రభుత్వం ఏమో చేయలేదని దయాకర రావు చెప్పడం బాగా లేదని హరీష్ రావు అన్నారు. తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర జౌళిశాఖ మంత్రి వద్దకు వెళ్లి తెలంగాణకు రావాలని కోరానని చెప్పారు. ఆత్మహత్యల బాధ ఏమిటో టీడీపీ వాళ్లకేం తెలుసునన్నారు. నాబార్డ్ ద్వారా మార్క్ ఫెడ్‌కు రూ.300 కోట్లు విడుదల చేశామన్నారు.

ముసలమ్మ పత్తి ఇచ్చింది.. ఎర్రబెల్లి

సభలో ఎర్రబెల్లి పత్తికి మద్దతు ధర లభించడం లేదని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను అసెంబ్లీకి జనగాం నియోజకవర్గం నెల్లుట్ల నుండి వచ్చానని, ఆ సమయంలో ఓ ముసలమ్మ పత్తి పట్టుకొని వెళ్తుంటే.. తాను పత్తిని ఎంతకు అమ్మావని అడిగితే, గతంలో అమ్మిన దాని కంటే తక్కువే అమ్మినట్లు చెప్పిందన్నారు. దీంతో తాను అసెంబ్లీలో పోరాడుతాం.. పత్తి ఇవ్వాలని కోరానని, దీంతో ఆమె తనకు పత్తి ఇచ్చిందని తెలిపారు. ఆమె తెరాసకే ఓటు వేసిందన్నారు.

తాము ఇటీవలె సీఎం నియోజకవర్గమైన గజ్వెల్ వెళ్లామని ఎర్రబెల్లి అన్నారు. తాము వెళ్లిన చుట్టుపక్కల గ్రామాల వారు తెరాసకే ఓటు వేశారని, కానీ అక్కడే ఆత్మహత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ విధానాల వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+