ఆగని జలజగడం: తెలంగాణా విద్యుత్ ఉత్పత్తిపై మళ్ళీ ఫిర్యాదు; కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ!!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలకు ఇంకా తెరపడలేదు. కృష్ణా జలాల వాడకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. ఒకరిమీద ఒకరు వరుసగా కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కృష్ణా జలాల వాటాల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారి కేంద్రం జోక్యం చేసుకుంటున్నా రెండు రాష్ట్రాల తీరు ఏమాత్రం మారలేదు.

కృష్ణా బోర్డుకు తెలంగాణాపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు
ఇక తాజాగా కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ రాష్ట్రం పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది.విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద జలాలనుతెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తోంది అని ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ గేట్లు మూసివేసినా టీఎస్ జెన్కో కరెంటును ఉత్పత్తి చేస్తోందని ఏపీ ఆరోపించింది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణ చేస్తున్న కరెంటు ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలని కృష్ణ బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి నారాయణ రెడ్డి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌కులేఖ రాశారు.

శ్రీశైలం , నాగార్జున సాగర్ లలో విద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదు
శ్రీశైలంలో సెప్టెంబర్ 24వ తేదీన 213. 40 టీఎంసీల నీరు ఉండగా, ఐదు రోజులుగా తెలంగాణ చేసిన పవర్ జనరేషన్ తో నీటి మట్టం బాగా పడిపోయిందని, ప్రస్తుతం నీటి మట్టం 195. 21 టీఎంసీలకు తగ్గిపోయిందని ఏపీ పేర్కొంది. 18 .19 టీఎంసీల నీటిని వృధాగా దిగువకు వదిలేశారని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ పై ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోనూ తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తుందని లేఖలో పేర్కొంది. నాగార్జునసాగర్ లో గురువారం ఉదయం వరకు 311.15 టీఎంసీల నీటి నిల్వ ఉంటే దిగువన ఎటువంటి తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తూ, నీటిని వృధాగా దిగువకు వదులుతుందని లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్న తెలంగాణా జెన్కో
పులిచింతలలోనూ, ప్రకాశం బ్యారేజీ లోనూ గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉందని, తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి తో ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేయాల్సి వస్తుంది అని లేఖ ద్వారా వెల్లడించారు. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే, బోర్డు అనుమతితో విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని ఈ ఏడాది మే 27వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నా, బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, కృష్ణా మిగులు జలాలను వృధాగా సముద్రంలో కలిపేస్తుందని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

విద్యుత్ ఉత్పత్తిని నిలిపివెయ్యాలని ఏపీ ఈఎన్సీ లేఖ
వాటర్ ఇయర్ ముగిసేవరకు రెండు రాష్ట్రాల తాగునీరు, సాగునీరు అవసరాలకోసం రెండు రిజర్వాయర్లలో నీటి నిల్వలు కొనసాగించాల్సి ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఆ నిబంధనను తుంగలో తొక్కుతూ ఉందని ఏపీ ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. కృష్ణా బోర్డు జోక్యం చేసుకుని శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ లో కరెంటు ఉత్పత్తి నిలిపివేయాలని ఏపీ ఈఎన్సీ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications