మరో వారం కృష్ణా నీరు: తెలంగాణ ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు మరో వారం పాటు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలనే కృష్ణా బోర్డు నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుమంటోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఈ వివాదం మరింతగా ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో మాటమాత్రం చెప్పకుండా, చర్చ జరపకుండా ఏకపక్షంగా మరోసారి నీటి విడుదలకు కృష్ణా బోర్డు ఆదేశాలు ఇవ్వడం పట్ల తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంది.
వాస్తవానికి, కృష్ణా డెల్టాలోని నాలుగు జిల్లాలకు అవసరమైన తాగునీటిని మరో వారంపాటు కొనసాగించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈమేరకు నేరుగా నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీరుకు ఆదేశాలు జారీ చేసింది. తొలి విడత నీటి విడుదల గడువు మంగళవారంతో ముగియగా, అనుకున్న మేరకు నీరు చేరకపోవడంతో మరో వారంపాటు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

తెలంగాణ నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కృష్ణా బోర్డు చైర్మన్ పాండ్యన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని, తమ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. కృష్ణా డెల్టాకు వారం పాటు ఆరువేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని పాండ్యన్ గతవారం ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 7 గంటలతో గడువు ముగిసింది. దీంతో నీటి విడుదల నిలిపేస్తున్నట్టు సిడబ్ల్యుసి ఛైర్మన్‌కు సమాచారం అందించారు.
వారంపాటు నీటిని విడుదల చేసి తరువాత సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుందామని గతంలో చెప్పడం వల్ల, నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు మూడు రోజులు పట్టొచ్చని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ ఊహించని విధంగా నీటి విడుదల గడువు ముగిసిన కొద్దిసేపటికే మరో వారంపాటు ఆరువేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని సిడబ్ల్యుసి ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రితో సమావేశమై సమగ్రంగా చర్చించారు. రాత్రి ఎనిమిది గంటలకు నీటి విడుదల నిలిపివేశారు.
అయితే విడుదల చేసిన నీరు డెల్టాకు చేరుకోకుండా మధ్యలోనే ఉందని, కేవలం 1.6 టిఎంసిల నీరు మాత్రమే చేరిందని ఆంధ్ర అధికార్లు అంటున్నారు. మరో వారంపాటు నీటి విడుదల జరపాలని కేంద్ర జల సంఘాన్ని కోరారు. అయితే, ఇప్పటికే విడుదల చేసిన నీటిని పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసుకుంటూ డెల్టాకు చేరలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నాటకం చేస్తుందన్న వాదనను తెలంగాణ ఇరిగేషన్ వర్గాలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications