వాటర్ వార్ కాస్త శ్రీశైలం పవర్ వార్ గా .. కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ లేఖ, టార్గెట్ తెలంగాణా జెన్ కో !!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటిని దోపిడీ చేస్తోందని తెలంగాణ మంత్రులు ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. ఇక తామెలాంటి జల దోపిడీకి పాల్పడడం లేదని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇస్తూ ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులపై విమర్శలు చేస్తూనే సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం అంటున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిపై పంచాయతీ
ఈ క్రమంలో తాజాగా నీటి వాటాల విషయంలో నెలకొన్న వివాదం, ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం తయారు చేస్తున్న పవర్ పంచాయతీ గా మారింది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీ సర్కార్ ఇప్పటికే తెలంగాణపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మరో లేఖ కృష్ణానది యాజమాన్య బోర్డుకు రాసింది. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి రాసిన లేఖతో పవర్ పంచాయతీ తెరమీదకు వచ్చింది.

అనుమతి లేకుండానే తెలంగాణ జెన్ కో విద్యుదుత్పత్తి
కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండానే తెలంగాణ జెన్ కో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వినియోగించుకోవటంపై సర్కార్ మరోమారు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది . జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం కేటాయింపుతో సంబంధం లేకుండానే నీటిని వినియోగించుకుంటున్నదని, కృష్ణా రివర్ బోర్డు కు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై రెండు సార్లు లేఖ రాసినా కృష్ణా రివర్ బోర్డు పట్టించుకోవడం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది.

ఇప్పటికే 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని లేఖ
ఇప్పటికే సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని లేఖలో స్పష్టం చేశారు. ఎగువ నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహం వస్తుంటే, అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నీటిని ఉపయోగించుకోవడం సరికాదని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నీటి వినియోగాన్ని నిలుపుదల చేయాలంటూ, తెలంగాణ అధికారులను జలదోపిడీ చెయ్యకుండా అడ్డుకోవాలంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డు రాసిన లేఖలో పేర్కొంది.

రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణా , తెలంగాణా జెన్ కో పవర్ ప్రొడక్షన్ పై ఏపీ
ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఓ పక్క జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, మరోపక్క కేంద్ర జల శక్తి శాఖ నుండి పెరిగిన ఒత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించడానికి కృష్ణా బోర్డు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని అక్రమ ప్రాజెక్టులను సందర్శించాలని ఏపీ కూడా లేఖ రాసినట్లుగా సమాచారం. ఇక తాజాగా మరోమారు అనధికారికంగా కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలంటూ మరో లేఖ రాసి తెలంగాణ రాష్ట్రానికి పవర్ ఫుల్ షాక్ ఇచ్చింది ఏపీ.












Click it and Unblock the Notifications