ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం హబ్ గా హైదరాబాద్ .. కీలక అడుగు
హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం రాజధానిగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ విదేశీ రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలని నిశ్చయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి, అవసరమైన చర్యలను అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
ఈ కమిటీలో సభ్యులుగా గౌరవ్ ఉప్పల్ - మేనేజింగ్ డైరెక్టర్, TGMSIDC, పి. గౌతమి - మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డాక్టర్ బీరప్ప - మాజీ డైరెక్టర్, నిమ్స్ (NIMS)ను నియమించింది. ఈ కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసి, నెల రోజుల్లోగా ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించాల్సి ఉంటుంది.

సనత్‌నగర్ టిమ్స్ లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్ ఏర్పాటుపై అధ్యయనం
కమిటీ పరిశీలించే కీలక అంశాల విషయానికి వస్తే సనత్‌నగర్ టిమ్స్ (TIMS)లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక 'ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం బ్లాక్' ఏర్పాటుపై అధ్యయనం చేయనుంది.విదేశీ రోగులకు అందించే చికిత్సలు, వాటికి సంబంధించిన ప్యాకేజీలు, ధరల విధానాన్ని ఖరారు చేయడం చేయాల్సి ఉంటుంది. విదేశీయుల కోసం భాషా అనువాద (Translators) సేవలు, వారి సంస్కృతికి తగ్గ ఆహార సదుపాయాలపై సిఫార్సులు కూడా కమిటీ చేయనుంది.
ప్రపంచ స్థాయి వైద్య కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం
తెలంగాణ మెడికల్ అండ్ వెల్‌నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించటం పైన కూడా కమిటీ నివేదిక ఇవ్వనుంది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి వైద్య కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం త్వరలోనే ఒక భారీ అంతర్జాతీయ మెడికల్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
తెలంగాణను ప్రపంచ ఆరోగ్యపటంలో నిలిపే కీలకఅడుగు
ఈ సందర్భంగా నిమ్స్, టిమ్స్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం మన ప్రభుత్వ ఆసుపత్రులు కింద పేర్కొన్న సంక్లిష్ట చికిత్సల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి: కార్డియాక్ కేర్ (గుండె జబ్బుల చికిత్స), ట్రామా కేర్ (అత్యవసర వైద్యం), న్యూరో సైన్సెస్ & గ్యాస్ట్రో సైన్సెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విప్లవాత్మక చర్యలు తెలంగాణను ప్రపంచ ఆరోగ్య పటంలో నిలపనున్నాయి.













Click it and Unblock the Notifications