హైదరాబాద్ మెట్రో విస్తరణ అడ్డుకుంటుంది ఆయనే: భగ్గుమన్న సీఎం రేవంత్!
హైదరాబాద్ నగర అభివృద్ధి, ప్రజా రవాణా వ్యవస్థల విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరంలో మెట్రో రైలు రెండో దశ (Phase 2) విస్తరణ పనులను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
మెట్రో రెండో దశకు కేంద్రం నుండి అనుమతులు రాకుండా చేస్తున్న కేంద్రమంత్రి: సీఎం రేవంత్ ఫైర్
ఉప్పల్ భగాయత్ పరిధిలో పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ ఆరోపణలు చేశారు.
నగర ప్రజల ప్రయాణ అవసరాల కోసం తాము ప్రతిపాదించిన మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేటీఆర్ కుసాయం చేసే కేంద్రమంత్రి: రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు
కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో బీజేపీ నేతగా చలామణి అవుతున్నప్పటికీ, తెరవెనుక మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పరోక్షంగా సహాయం చేస్తున్నారంటూ సొంత పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మెట్రో ఫైళ్లకు కేంద్రం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు?
మెట్రో ఫైళ్లకు కేంద్రం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదో స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి భాగ్యనగర ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునా నది అభివృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో గంగా నది శుద్ధీకరణ వంటి ప్రాజెక్టులను బీజేపీ నాయకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని సీఎం గుర్తు చేశారు.
మూసి పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
అక్కడ నదులను ప్రక్షాళన చేస్తే అభినందించే కమలం పార్టీ నేతలు, తెలంగాణలో తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మూసీ నది పునరుజ్జీవన' ప్రాజెక్టును మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత తమ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనతో పాటు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిధుల సాధన, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తుందని, కేంద్రం ఎలా అడ్డుకుంటుందో తాము కూడా చూస్తామని సవాల్ విసిరారు.
మల్కాజిగిరి అభివృద్ధి నా బాధ్యత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 1.34 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారని, ఇంతటి భారీ జనాభాకు మౌలిక సదుపాయాలు కల్పించడం సాధారణ విషయం కాదన్నారు. పరిపాలనను మరింత సులభతరం చేసేందుకే జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే యోచన చేస్తున్నామని, దీనిపై విపక్షాలు అనవసరపు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తనను ఎంపీగా గెలిపించి రాజకీయంగా అండగా నిలిచిన మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, నాడు ప్రతిపక్ష ఎంపీగా నిధుల కొరత వల్ల చేయలేకపోయిన పనులన్నింటినీ, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో పూర్తి చేసి మల్కాజిగిరి రూపురేఖలు మారుస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications