అందుకు మేం రెడీ.. బనకచర్ల వివాదంపై రేవంత్ కు ఇచ్చి పడేసిన సీఎం చంద్రబాబు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బనకచర్ల ప్రాజెక్టు పైన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గోదావరి, కృష్ణ నీటి వనరుల వినియోగం పైన తలెత్తుతున్న వివాదాల పైన స్పందించారు. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకోవడం పైన తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడానికి సీఎం చంద్రబాబు తప్పు పట్టారు. అసలు ఇందులో తప్పేముందో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
గొడవ పడితే ఎవరికి లాభం : సీఎం చంద్రబాబు
నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు గొడవ పడితే చివరికి ఎవరికి లాభం జరగదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పరస్పర అవగాహనతో నీటిని వినియోగించుకోవాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కృష్ణా నదిలో కొంత నీటి కొరత కారణంగా గోదావరి నుంచి నీటిని తరలించాల్సిన అవసరం తలెత్తిందని, పోలవరం మినహా గోదావరి నదిపై ఉన్న చాలా ప్రాజెక్టులకు అధికారిక అనుమతులు లేవన్న సంగతి కూడా చంద్రబాబు గుర్తు చేశారు.

రాష్ట్రాల మధ్య శాంతియుతంగా సహకార దృక్పథం ఉండాలి
అయితే కొత్త ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన వాటా మేరకు మాత్రమే తాము నీటిని వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు. బనకచర్ల విషయంలో అనవసరపు రగడ చేయడం మంచిది కాదని, రాష్ట్రాల మధ్య శాంతియుతంగా సహకార దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కేంద్ర స్థాయిలో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నాం
అవసరం అనుకుంటే ఈ అంశం పైన ఢిల్లీకి వెళ్లి కేంద్ర స్థాయిలో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరుమూ కలిసి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వంటి నీటి ప్రాజెక్టుల పైన తెలంగాణ ప్రభుత్వం సంయమనం పాటించాలని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటేనే మంచిదని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఏపీ, తెలంగాణ రెండు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆశయం
రెండు రాష్ట్రాలకు గొడవపడడం అంటే ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాళేశ్వరం కట్టుకున్నప్పుడు తాము అడ్డు చెప్పలేదని దేనికైనా చట్టబద్ధత కావాలంటే కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు అన్నారు. మనం మనం తిట్టుకుంటే రాజకీయం చేయాలని చూసేవారు చాలామంది ఉంటారని పేర్కొన్న చంద్రబాబు ఎవరికి అవకాశం ఇవ్వద్దని సూచించారు. ఏపీ, తెలంగాణ రెండు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆశయమని, అదే బాటలో అభివృద్ధి పదంలో ముందుకు నడవాలన్నారు.
కూర్చుని చర్చించి సమస్య పరిష్కరిద్దాం
గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయని ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చని 3000 టీఎంసీల నీళ్లు ఏటా సముద్రంలో వృధాగా కలిసి పోతున్నాయని, తెలంగాణ ఎంత వాడుకున్నా 100 టీఎంసీలు వాడుకోగలరు అని, ఏపీ వాడుకున్నా మరో వంద టీఎంసీలు వాడుకోగలదు అని దీనిపైన రాద్ధాంతం దేనికని చంద్రబాబు ప్రశ్నించారు. కూర్చుని చర్చించుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుందాం అని సూచించారు.












Click it and Unblock the Notifications