ఇస్రో సాయం కోరాం: తుఫాన్‌పై చంద్రబాబు
హైదరాబాద్: హుదుద్ తుఫానుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానంతో అంచనా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌తో తాము మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఏయే ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందో సమీక్ష చేస్తున్నామని, రిమోట్ సెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
తుఫాను తాకిడి ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. తుఫాను ప్రభావం ఉండే జిల్లాల్లో అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని అన్నారు. తుఫానుపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వీడియో సందేశం ఇచ్చారు. తుఫాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

తుఫాను ప్రభావానికి గురయ్యే ఐదు జిల్లాల్లో సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 13 ఎన్టీఆర్ ఎఫ్ టీవీలను, 15 శాటిలైట్ ఫోన్లను సిద్ధం చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. తుపాను కారణంగా పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలిరావాలని కోరారు. తుపాను పరిస్థితిపై కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని బాబు తెలిపారు.
ఏం చేయవచ్చో చూస్తాం
గుంటూరు జిల్లాకు చెందిన సరస్వతి సిమెంట్స్ బాధిత రైతులు శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తమపై కర్మాగారం యాజమాన్యం దాడులు చేసిందని వారు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
చెన్నాయపాలెం రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చట్టపరిధిలో ఏం చేయాలో చూస్తామని ఆయన చెప్పారు. రైతులు, ఎస్సీలు, మహిళలపై దాడులు జరిగితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. తమ ప్రభుత్వం రైతుల ప్రాణాలకు హామీ ఇస్తుందని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications