'కిరణ్! మాకు తెలుసు, విజయమ్మతో బాబు సిద్ధమా'
హైదరాబాద్: తామేం చేయాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమకు చెప్పాల్సిన అవసరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చర్చలో పాల్గొనాలని, అప్పుడే సమస్యలు తెలుస్తాయని కిరణ్ మధ్యాహ్నం అన్నారు. దీనిపై మైసూరా స్పందించారు.
ఏం చేయాలో కిరణ్ తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో తమ వాదన ఎలా రికార్డు కావాలో తమకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబు శాఖ మార్చినంత మాత్రాన వచ్చే ప్రయోజనమేమీ లేదన్నారు. తాము సభలో సమైక్య తీర్మానానికి పట్టుబడతామన్నారు.

విభజన ముసాయిదా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని ఎగతాళి చేసేలా ఉందన్నారు. బిల్లు రాష్ట్రపతి పంపిన విధానం, సభలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఈ నెల 3వ తేదీన బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. 4న అన్ని నియోజకవర్గాలలో మోటార్ బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. 7-10వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు ఉంటాయని, ఆ తర్వాత సభలో జరిగే పరిణామాలను బట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
చంద్రబాబుకు సవాల్
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కోర్టులో వేసిన పిటిషన్ పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విజయమ్మ 18 అంశాల పైన చంద్రబాబు మీద కోర్టులో పిటిషన్ వేశారని, వాటన్నింటి పైనా చర్చకు రావాలన్నారు.
ఎంపీల సంకల్ప్ దీక్ష
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఈ నెల 3, 4వ తేదీలలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద సంకల్ప్ దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో లగడపాటి రాజగోపాల్, హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, సాయి ప్రతాప్ తదితరులు పాల్గొంటారు.












Click it and Unblock the Notifications