సంక్రాంతి వేడుకలకు దూరం: వారంతా బాధలో ఉన్నారన్న నారా భువనేశ్వరి
అమరావతి: రాజధానిగా అమరావతే ఉండాలంటూ గత 26 రోజులుగా రైతులు, మహిళలు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆందోళన చేస్తున్న రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా ఆమె తన గాజులను విరాళంగా ఇచ్చారు.
ఈ క్రమంలో నారా భువనేశ్వరి సంక్రాంతి వేడుకలను జరుపుకోమంటూ తాజాగా ప్రకటించారు. ఆదివారం ఆమె చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఆదివారం నాగులమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆనవాయితీ తప్పకూడదనే ఉద్దేశంతో మొక్కులు తీర్చుకున్నామని చెప్పారు. అమరావతి ప్రజలు బాధల్లో ఉంటే తాము పండగ చేసుకోమని అన్నారు. అమరావతి ప్రజలకు అండగా ఉండాలని సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉంటున్నామని భువనేశ్వర్ తెలిపారు.

ఇది ఇలావుండగా, ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట పర్యటనకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు కాన్వాయ్ బయటకు రాగానే వాహనాలను పోలీసులు నిలిపేశారు. దీంతో చంద్రబాబు వాహనం నుంచి దిగి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది.
మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ర్యాలీ చేస్తుంటే ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. తన వెంట వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరమేంటని నిలదీశారు. శాంతియుత నిరసనలను ఎందుకు అండ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ చట్ట వ్యతిరేక చర్యలను విడనాడాలని చంద్రబాబు హితవు పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల ప్రదర్శనలకు పోలీసులు దగ్గరుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారికి మాత్రం 144, పోలీస్ యాక్ట్ 30ని వర్తింపజేయడం లేదని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు అమరావతి పరిరక్షణ సమితి నిరసన తెలుపుతుంటే కఠిన నిర్బంధ చర్యలతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
దుర్గమ్మ గుడికి వెళ్తున్న మహిళలను అడ్డుకుని వారిపై పోలీసులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళా హక్కులను కాలరాయడం కాదా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను బూటుకాళ్లతో తన్నడం, లాఠీలతో కొట్టడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా? అని చంద్రబాబు నిలదీశారు.












Click it and Unblock the Notifications