కెసిఆర్ బాటలో బాబు: ప్రాణమున్నంత వరకూ జగన్‌తోనేనన్న సుజయ
విజయనగరం: తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో దివంగత నేత వైయస్ బొమ్మతో విజయం సాధించామని, ప్రాణమున్నంతవరకూ తాము వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, రాజన్నదొర, శ్రీవాణి తేల్చి చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, బేబినాయిన తదితరులతో కలసి వారు మంగళవారం ఉదయం బొబ్బిలి కోటలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఉనికి కోల్పోవడంతో.. సీఎం చంద్రబాబు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ విషయంలో అలా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.
వైయస్ జగన్ నాయకత్వంలో తామంతా పనిచేస్తామని స్పష్టం చేశారు. వివరణ తీసుకుని కూడా ఎలక్ట్రానిక్ మీడియా అసత్య ప్రచారం చేసిందని, మరోసారి అసత్య ప్రచారం చేస్తే... చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు. టీడీపీకి చెందిన వారు తిరిగి తమ గూటికి చేరుకున్నారే తప్ప కొత్త వారెవరూ వైయస్సార్ కాంగ్రెస్ వీడలేదన్నారు.

పార్టీలు మారినప్పడు రాజీనామా చేసి నైతిక విలువలు కాపాడుకోవాలని, ప్రస్తుతం పార్టీ ఫిరాయించినవారు అలా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలకు కాలపరిమతి లేకపోబట్టే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.
కాగా, సోమవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు సోమవారం టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications