CBN 4.0: చంద్రబాబు పాలనకు నెల- ఈ 30 రోజుల్లో ఏం జరిగిందంటే ? మెరుపులతో పాటు.. !
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వచ్చీ రాగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన ఐదు సంతకాల హామీని నెరవేర్చారు. ఆ తర్వాత వీటిలో కొన్నింటి అమలు కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఏర్పాటు అయి నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఈ నెల రోజుల్లో సాధించిందేంటి ? భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా ? ఆయా అంశాలపై ఓ విశ్లేషణ.
చంద్రబాబు అధికారం చేపట్టి ఇవాళ్టికి నెల రోజులు పూర్తయింది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించింది. అలాగే అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి కావాల్సిన నిధులు, సాయం కోసం వినతుల సమర్పణ కూడా పూర్తయింది. అలాగే గత ప్రభుత్వం పాలనలో తప్పిదాలపై శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తోంది. నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నా, వాటి అమలులో స్పీడ్ ఏ మేరకు ఉంటుందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఐదు సంతకాల హామీని ముందుగా నెరవేర్చారు. ఇందులో మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు వీలుగా సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. వీటిలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల కాగా.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతుండగా.. పెన్షన్ల పెంపు పూర్తి స్ధాయిలో అమలైంది. స్కిల్ సెన్సన్ త్వరలో మొదలు కానుంది.
అలాగే చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ల పెంపు మాత్రం అమలైంది. ప్రతీ ఇంట్లో మహిళకు రూ.1500 ఇచ్చే మహాలక్ష్మి పథకం కానీ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, ఉచిత గ్యాస్ సిలెండర్లు వంటి హామీల అమలు ఇంకా ప్రారంభం కాలేదు. అమ్మఒడి స్ధానంలో తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అందులోనూ ఇంటికి గరిష్టంగా ముగ్గురు పిల్లల వరకూ ఇస్తామన్న ప్రస్తావన లేకపోవడంపై చర్చ జరుగుతోంది. మరో ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక ప్రారంభించారు. అయితే రవాణా, ఇతర ఖర్చులు ఉచిత ఇసుక పథకంపై అనుమానాలు రేకెత్తించాయి.
చంద్రబాబు సహా మంత్రులు బాధ్యతలు చేపట్టగానే గత ప్రభుత్వ ముద్రను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ విధేయులుగా ముద్ర పడిన ఐఏఎస్, ఐపీఎస్ లను పక్కనబెట్టేశారు. వారి స్ధానంలో ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారని భావించిన వారికి అవకాశాలు దక్కాయి. అలాగే గత ప్రభుత్వం పక్కనబెట్టిన అమరావతి రాజధాని, పోలవరంపై సీఎం చంద్రబాబు వరుస రివ్యూలు చేస్తూ గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే విభజన సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ నిర్వహించారు. అటు ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ముందు లక్ష కోట్ల సాయం డిమాండ్ పెట్టారు. నెలరోజులే కావడంతో రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలు, హామీల అమలు ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా మారనుంది.












Click it and Unblock the Notifications