పవన్‌కు ఆ 24 సీట్లు కూడా మిగిలేట్టు లేవుగా- కోత ఖాయం?
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.
ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరితే సీట్ల పంపకాలు ఎలా అనేది చర్చనీయాంశమౌతోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సగానికి పైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీని దెబ్బకే పలు చోట్ల అసంతృప్తులు వ్యక్తమౌతోన్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. టికెట్లను ఆశించిన సీనియర్లు చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బీజేపీ కూడా కూటమిలో చేరితే సీట్ల పంపకాల వ్యవహారం మళ్లీ మొదటికొస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. జనసేనకు కేటాయించిన 24 స్థానాలు పోగా.. మిగిలిన 57 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది చంద్రబాబుకు. ఇప్పుడు తలెత్తిన అసమ్మతిని, అసంతృప్త వాతావరణాన్ని చల్లార్చడానికి ఆ సీట్లల్లో సీనియర్లను నిలబెట్టొచ్చనే ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో బీజేపీకి ఎన్ని స్థానాలను కేటాయిస్తారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనకు ఇచ్చిన 24 స్థానాల్లోనే బీజేపీకి సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాలను జనసేన, లోక్‌సభ సీట్లను తెలుగుదేశం పార్టీ.. బీజేపీ వాటాగా కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications