ఏపీలో మద్యం రేట్లు తగ్గలేదా ? రూ.99 క్వార్టర్ బాటిల్ కిక్కెంత ?
ఏపీలో కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం పాత బ్రాండ్లను, తగ్గింపు ధరలతో అమలు చేస్తున్నట్లు చెబుతోంది. అయితే వాస్తవంగా క్షేత్రస్దాయిలో పరిస్దితి ఎలా ఉందో తెలుసుకునేందుకు వన్ ఇండియా విజయవాడలో ప్రయత్నించింది. ఇందులో మద్యం ధరల తగ్గింపుతో పాటు ఇతర అంశాలపై వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అలాగే రూ.99 క్వార్టర్ మద్యం వ్యవహారంపైనా స్పందించారు.
ప్రభుత్వం తెచ్చిన కొత్త మద్యం విధానంలో భాగంగా షాపుల్ని ప్రైవేటుకు అప్పగించింది. అలాగే రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి తెస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకూ రూ.99ల క్వార్టర్ బాటిల్ మద్యం చాలా చోట్ల అందుబాటులోకి రాలేదు. వచ్చిన చోట కూడా నాసిరకంగా ఉందని మందుబాబులు చెప్తున్నారు. గతంలో అమ్మిన రూ.130, రూ.150 రేట్లకే క్వార్టర్ బాటిల్స్ ను విజయవాడలోని మద్యం షాపుల్లో విక్రయిస్తున్నారు.

అలాగే ఈసారి మద్యం ధరల తగ్గింపు, పాత బ్రాండ్లన్నీ తిరిగి తెస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు కూడా ఇంకా అమల్లోకి రాలేదు లేదా అమలు కావడం లేదని అర్ధమవుతోంది. నగరంలోని పలు మందు షాపుల్లో అమ్ముతున్న మద్యం బ్రాండ్లన్నీ దాదాపుగా వైసీపీ ప్రభుత్వంలో అమ్మినవే అని చెప్తున్నారు. అలాగే రూ.99కే క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి తెస్తామన్న మాటలు కూడా అమలు కాలేదని, దీంతో ఇప్పటికీ రూ.130 పైనే ఖర్చుపెట్టి మద్యం కొనాల్సి వస్తుందంటున్నారు. మరికొన్ని చోట్ల ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications