జగన్ అల్టిమేటంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే
ఏపీలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇందులో 15 మంది వరకూ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తి కరంగా లేదని తేలినట్లు జగన్ వెల్లడించారు. వీరందరికీ వ్యక్తిగతంగా రిపోర్టులు పంపడంతో పాటు త్వరలో పిలిపించి మాట్లాడతామని, అప్పటికీ ప్రదర్శన మెరుగుపడకపోతే మాత్రం టికెట్లు ఇవ్వలేనని జగన్ తేల్చిచెప్పేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించారు.
ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే మాత్రం తనకూ టికెట్ రాదని మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉంటూ మరోసారి 175 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని జగన్ కోరినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోండి, ప్రజలు మనల్ని ఎంతో ఇష్టపడుతున్నారు. తాను నిర్దేశించిన విధంగా పనిచేస్తూ, మీరు నష్టపోకుండా ప్రజలు ఇష్టపడేలా పనిచేయడంటూ సీఎం జగన్ చెప్పారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వెల్లడించారు.

జగనన్నసురక్ష పథకంపై ఇవాళ చర్చించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. వాలంటీర్లు, గృహసారధులు ఎలా పనిచేయాలని జగన్ వివరించారన్నారు. వేసవి కాబట్టి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ఎలా జరిగినా తాను పట్టించుకోలేదని, కానీ ఇప్పటి నుంచి మాత్రం అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని జగన్ చెప్పారన్నారు. 2014-19 నుంచి ఎన్ని రంగాలు కుప్పకూలాయో, అభివృద్ధి ఎలా కుంటుపడిందో వివరించారన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం పంపిణీలో లోపాల్ని సరిదిద్దుకోవడంపై జగన్ ఎమ్మెల్యేలతో చర్చించినట్లు మరో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. అర్హత ఉండీ పథకాలు అందని వారికి సంక్షేమం అందించేందుకు అందరూ కృషి చేయాలని జగన్ చెప్పారన్నారు. ఏ ఒక్క లబ్దిదారుడూ అర్హత ఉండీ పథకాలు రావట్లేదనే మాట అనకుండా చూడాలని సీఎం జగన్ కోరినట్లు మరో మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 87 శాతం పైబడి కుటుంబాలకు లబ్ది చేస్తున్నట్లు జగన్ చెప్పారన్నారు. 175కు 175 సీట్లు గెల్చుకునేలా, ఈ 9 నెలలు విశ్రాంతి లేకుండా పనిచేస్తామని ఆయన తెలిపారు. గడప గడపకూ తిరగని వారిని పిలిచి మాట్లాడతామని మాత్రం జగన్ చెప్పారన్నారు.












Click it and Unblock the Notifications