ఆరోగ్యశ్రీ కార్డుపై జగన్ ఫోటో సరే.. పీఎం మోడీ ఫోటో ఎక్కడ? మండిపడిన కేంద్రమంత్రి
కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ విజయవాడ ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడ ఆరోగ్యశ్రీ కార్డులను పరిశీలించిన ఆమె ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రం పాక్షికంగా నిధులు సమకూర్చే పథకమైన ఆరోగ్యశ్రీ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించకపోవడం దారుణమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా పీ ఎం జె వై ఏ నిధులతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు మాత్రమే ముద్రించి ఉండడాన్ని ఆమె తప్పు పట్టారు.

ప్రధాని ఫోటో ముద్రించి ఉండకపోవడం పై కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఆరోగ్యమిత్ర హెల్ప్ డెస్క్ సిబ్బందితో కూడా మాట్లాడిన కేంద్ర మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్ మీద కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ల ఫోటోలు మాత్రమే ఉండడాన్ని చూసి ప్రధాని ఫోటోలు ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది అనే విషయం మీకు తెలుసా.. లేదా అంటూ ఆమె వారిని ప్రశ్నించారు.
అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు అందిస్తున్న వైద్యసేవలు ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారా అనేది ఆమె తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌ను, టెలిమెడిసిన్ హబ్‌లో అందిస్తున్న సేవలను కూడా ఆమె పరిశీలించారు. ఆమె టెలిమెడిసిన్ సేవల గురించి రోగితో మాట్లాడింది. ఆసుపత్రిలో కేంద్ర పథకాల కింద కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయాన్ని కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications