ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?: వైసీపీ, రఘువీరా తీవ్ర వ్యాఖ్య
నెల్లూరు: ఎలాంటి అన్యాయాన్ని అయినా ఎదిరిస్తానని, ఎవరినైనా ప్రశ్నిస్తానని గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సోమవారం నిలదీశారు.
ప్రశ్నించే పవన్ ఎక్కడున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు అంశం పైన ఆయన ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అడిగారు. తెలంగాణలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎందుకు ప్రకటించారో చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేసేలా కేంద్రం, గవర్నర్ ఒత్తిడి తేవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం వల్లే సెక్షన్ 8ను తెరపైకి తెచ్చారన్నారు. సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఏ సీఎం కూడా ఓటుకు రూ.5 కోట్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిన చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అన్నా హజారే తమ్ముడిని అని చెప్పుకున్న చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు బాబుకు లేదన్నారు.
చంద్రబాబు అవినీతిపరుడు: రామచంద్రయ్య
చంద్రబాబు తొలి నుంచి అవినీతిపరుడేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. కాకుంటే ఆయన ఇప్పుడు బయటపడ్డారని చెప్పారు. వదిలేయాలని ప్రధాని మోడీ కేసీఆర్‌కు చెబితే తప్ప ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు బయటపడలేరన్నారు. బాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి: రఘువీరా
ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీం కోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఓటుకు నోటు వ్యవహారంలో నిందితులెవరో తేల్చాలన్నారు. గడిచిన సంవత్సరం వ్యవధిలో బిగ్ బాస్‌కు, స్మాల్ బాస్‌కు వేల కోట్ల ముడుపులు అందాయని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదన్నారు. రేవంత్ కాదు చంద్రబాబే ఏ1 అన్నారు.
గత వారం ఢిల్లీకి వెళ్తే సీబీఐ విచారణను కోరేందుకు వెళ్లారని భావించామని, కానీ చంద్రబాబు మాత్రం ప్రధానిని, హోంమంత్రి, ఇతర మంత్రులను కలిసి వెంకన్న ప్రసాదాలు పంచి వచ్చారన్నారు. మోడీ కాళ్ల దగ్గర తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టి పెట్టిన బాబు తక్షణం తప్పుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications