కేసీఆర్ పోరులో జగనెక్కడ ? గ్యాప్ ఇంకా తగ్గలేదా ! స్టాలిన్, ఉద్ధవ్ కన్నా తీసిపోయారా !
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో గతంలో పోరాడి విఫలమైన చంద్రబాబు అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటానికి సిద్ధమవుతున్నారు జాతీయ స్దాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ను రోజూ నిలదీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అంతే కాదు కేంద్రంపై పోరుకు బీజేపీయేతర సీఎంలైన స్టాలిన్, మమత, ఉద్ధవ్ వంటి వారిని భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పొరుగునే ఉన్న జగన్ ను మాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్రంపై కేసీఆర్ పోరు
దక్షిణాది రాష్ట్రాలతో పాటు తనకు నచ్చని రాష్ట్రాల్ని, వాటి ముఖ్యమంత్రుల్ని, నేతల్ని సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా టార్గెట్ చేస్తున్న కేంద్రంపై తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పోరు ప్రారంభించారు. గతంలోనూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొంతకాలం హడావిడి చేసి ఆగిపోయిన కేసీఆర్.. ఈసారి మాత్రం గట్టిగానే స్పందిస్తున్నారు. నిత్యం బీజేపీని ఏదో ఒక అంశంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీంతో మోడీ సర్కార్ పై కేసీఆర్ పోరు వార్తల్లో నిలుస్తోంది.

మోడీ ప్రత్యర్ధులకు ఆహ్వానాలు
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ను నడుపుతున్న మోడీ సర్కార్ కు వివిధ రాష్ట్రాల్లో కీలక నేతలు ప్రత్యర్ధులుగా ఉన్నారు. వీరంతా కలిసి ఏదో ఒక రోజు మోడీ పుట్టి ముంచుతారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేతల్లో స్టాలిన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే వంటి వారు ఉన్నారు. వీరందరినీ ఓ ఉమ్మడి ఫ్రంట్ గా ఏర్పాటు చేసి మోడీ సర్కార్ పై పోరు సలపాలనేది కేసీఆర్ ఆలోచన. దీంతో ఇప్పటికే వీరిని ఒక్కొక్కరిగా సంప్రదించే పనిలో కేసీఆర్ బిజీగా కనిపిస్తున్నారు.అయితే వీరితో పాటు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలను కూడా కలుపుకుని పోతారా లేదా అన్న దానిపై చర్చ సాగుతోంది. అలాగే పొరుగున ఉన్న జగన్ విషయంలో కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది చర్చనీయాంశమవుతోంది.

కేసీఆర్ పోరులో జగన్ ఎక్కడ ?
మోడీపై కేసీఆర్ సాగిస్తున్న పోరులో పొరుగున ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎక్కడున్నారనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న సీఎంలను కలుపుకుంటున్న కేసీఆర్.. మోడీపై పోరులో జగన్ ను ఎందుకు కలుపుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ కలుపుకోవడం లేదా లేక జగనే ఎన్డీయేకు దగ్గరగా, మోడీకి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా కేసీఆర్ బహిరంగంగా జగన్ ప్రస్తావన కూడా తీసుకురాకపోవడంపై చర్చ జరుగుతోంది.
Recommended Video

స్టాలిన్, ఉద్ధవ్, మమత కన్నా తీసిపోయారా ?
మోడీపై సాగిస్తున్న పోరులో కేసీఆర్ ఇప్పటికే స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీలను ఆహ్వానించారు. వీరిలో స్టాలిన్, ఉద్ధవ్ తొలిసారి ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. వీరిలో స్టాలిన్, ఉద్ధవ్ పార్టీలు డీఎంకే, శివసేన కంటే పార్లమెంటులో సైతం జగన్ పార్టీ వైసీపీ బలంగా ఉంది. మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పోల్చి చూసినా వైసీపీ పోటీ పడే పరిస్ధితుల్లోనే ఉంది. మరి అలాంటి వైసీపీని, జగన్ ను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తారా ? వెళ్లి విజయం సాధిస్తారా అన్న చర్చ సాగుతోంది. మోడీతో స్నేహాన్ని జగన్ తెగదెంపులు చేసుకోకపోవడం వల్లే కేసీఆర్ జగన్ ను పట్టించుకోవడం లేదా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. దీనిపై కేసీఆర్ కానీ జగన్ గానీ క్లారిటీ ఇస్తే ఈ చర్చకు బ్రేక్ పడొచ్చు.












Click it and Unblock the Notifications