తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు... కడప రోడ్డుప్రమాదంలో ముగ్గురు మహిళల దుర్మరణం!!
మితిమీరిన వేగంతో వాహనాలను నడపొద్దని చెప్పినా, వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పదేపదే ఆర్టిఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం నిత్యకృత్యంగా మారుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఎంతో సంతోషంగా స్వస్థలానికి తిరిగి వెళుతున్న క్రమంలో కడప జిల్లాలో ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, 8 మంది గాయాల పాలైన ఘటన ఆయా కుటుంబాలలో శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే

తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీకి చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. 15 మంది కుటుంబ సభ్యులు టెంపో వాహనంలో తిరుమలకు చేరుకొని తిరుమల స్వామివారిని దర్శించుకుని గురువారం రాత్రి మళ్ళీ తిరిగి ప్రయాణమయ్యారు. అయితే వీరు ప్రయాణిస్తున్న వాహనం అర్ధరాత్రి కడప జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నిద్రమత్తులో ఆగి ఉన్న లారీని డీ కొట్టిన డ్రైవర్
కడప జిల్లా చాపాడు వద్దకు టెంపో చేరుకున్న సమయంలో వాహన డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని వేగంగా డ్రైవ్ చేయడంతో, టెంపో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో టెంపో లోని 30 సంవత్సరాల వయసున్న అనూష, 40 సంవత్సరాల వయసున్న ఓబులమ్మ, 48 సంవత్సరాల వయసున్న రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు ప్రమాద ఘటనతో స్థానికులు స్పందించి వెంటనే పోలీసులకు, 108కు సమాచారం అందించారు.

గాయపడి
న వారి పరిస్థితి విషమం
క్షతగాత్రులను పొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.
నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఈ రోడ్డు ప్రమాద ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు మృతి చెందిన వారి కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications