కీలక ఆధారాలు: రేవంత్ 'బాస్' ఎవరో తెలిసింది! బాబుపై కేసీఆర్ ఆరా!!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను ఏసీబీ అధికారులు నాలుగు రోజుల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో రేవంత్ 'బాస్' గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది.
నాలుగు రోజుల పాటు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను విచారించిన ఏసీబీ అధికారులు పలు విషయాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. శనివారం నుండి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు ఏసీబీ అధికారులు వీరిని విచారించారు.
ఈ విచారణలో ఏసీబీ చేతికి 'బాస్'కు సంబంధించిన ఆధారాలు లభించాయని సమాచారం. బాస్‌కు చెందిన విషయాలను ఏసీబీ సేకరించింది. రేవంత్ వ్యూహాత్మకంగా తన బాస్ మరొక నేత పేరు చెప్పినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ, రేవంత్ అసలు 'బాస్' గురించి చెప్పారా లేదా అనేది ఏసీబీ అధికారుల వద్దే ఉంది.

సమాచారం మేరకు.. రూ.5 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఓ కార్పోరేట్ సంస్థ బంజారాహిల్స్ బ్యాంక్ అకౌంట్ నుండి ఈ మొత్తాన్ని డ్రా చేశారని తెలుసుకున్నట్లుగా సమాచారం. ఈ డబ్బునే స్టీఫెన్ సన్‌కు ఇస్తామని చెప్పారు.
ఎవరికీ సంబంధం లేకుండా రూ.50 లక్షలు స్టీపెన్ సన్ ఇంటికి చేర్చారు. బాస్ విషయాన్ని ఏసీబీ కూపీ లాగింది. మరోవైపు, ముగ్గురు నిందితుల ఇళ్ల వద్ద ఏసీబీ సీసీ కెమెరా ఫుటేజీలను ఏర్పాటు చేసింది. వారి ఇళ్ల నుండి హార్డ్ డిస్క్ పాటు సీసీటీవీ వివరాలను సేకరించింది.
స్టీఫెన్ సన్‌ను విచారించేందుకు పిటిషన్
ఓటుకు నోటు వ్యవహారంలో ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌ను విచారించేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్టీఫెన్‌ను విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు కోర్టు విచారణ జరపనుంది.
కేసీఆర్‌తో ఏకే ఖాన్ భేటీ
ఏసీపీ డీజీ ఏకే ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలు సీఎం కేసీఆర్‌తో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. రేవంత్ విచారణ అనంతరం 'బాస్' వ్యవహారంపై చర్చించారని తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అంశంపై కూడా చర్చించారని సమాచారం. ఈ భేటీలో సీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications